Top News

BRS PROTEST | బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ధర్నా

 


బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ధర్నా

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం - మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

వెయ్యి రోజుల పాలనపై నిరసన

బాన్సువాడ, సెప్టెంబర్ 02:

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజుల్లో హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.

బుధవారం బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదని అన్నారు. రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.

వృద్ధులకు పింఛన్ ను రూ.4 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మోర్లె శ్రీనివాస్, అంజిరెడ్డి, జుబేర్, రత్నకుమార్, ధర్మ తేజ, మోచి గణేష్, బాడీ శ్రీను, చందర్, ఖలీల్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post