Top News

Doctor's Service 🩺 సెలైన్ చేతికి.. స్టెతస్కోప్ మెడలో..! రోగుల కోసం డాక్టర్ త్యాగం

సెలైన్ చేతికి.. స్టెతస్కోప్ మెడలో..! రోగుల కోసం డాక్టర్ త్యాగం

తానే పేషెంట్ అయినా.. వందలాది మందికి చికిత్స - బాన్సువాడ డాక్టర్ కి హ్యాట్సాఫ్

వైద్యో నారాయణో.. నిజం చేసిన బాన్సువాడ డాక్టర్ శ్రీను నాయక్ 

(తెలంగాణ డైలీ న్యూస్ / బాన్సువాడ)

వైద్యుడిని దేవుడితో సమానం అంటారు. ఆ మాటను బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఒక డాక్టర్ నిజం చేసి చూపించారు.

రోజూ వెయ్యి మందికి పైగా రోగులు వచ్చే ఆ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగం అంటే నిత్యం రద్దీగానే ఉంటుంది. అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ శ్రీను నాయక్ ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లేచి నిలబడే ఓపిక కూడా లేని పరిస్థితి. ఎవరైనా అయితే ఆ రోజు సెలవు పెట్టేస్తారు.

కానీ డాక్టర్ శ్రీను నాయక్ ఆలోచన వేరేలా ఉంది. "నేను లీవ్ పెడితే.. దూరం నుండి నమ్ముకుని వచ్చిన ఆ పేద రోగులు ఏమైపోవాలి? ఎమర్జెన్సీలో వారికి ఎవరు వైద్యం చేస్తారు?" అని ఆయన మదనపడ్డారు.

అంతే... ఒక చేతికి సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూనే, మరో చేత్తో స్టెతస్కోప్ పట్టుకుని డ్యూటీకి వచ్చేశారు.

ఒకవైపు తన శరీరంలోకి సెలైన్ చుక్కలు చుక్కలుగా వెళ్తుంటే, మరోవైపు ఆయన ఎమర్జెన్సీ వార్డులోని రోగులను పరీక్షిస్తూ, ప్రిస్క్రిప్షన్లు రాస్తూ, వారికి ధైర్యం చెబుతూ కనిపించారు.

ఈ దృశ్యాన్ని చూసిన రోగులు, వారి బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు. "ఇలాంటి డాక్టర్లు ఉండబట్టే మాకు సర్కార్ దవాఖాన మీద ఇంకా నమ్మకం ఉంది" అంటూ చేతులెత్తి దండం పెట్టారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లా వ్యాప్తంగా డాక్టర్ శ్రీను నాయక్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. వృత్తి అంటే ఇది, మానవత్వం అంటే ఇది అని అందరూ మెచ్చుకుంటున్నారు.

నిజంగా.. వైద్యో నారాయణో హరి: అనే మాటకు బాన్సువాడ డాక్టర్ శ్రీను నాయక్ నిలువెత్తు నిదర్శనం.

Post a Comment

Previous Post Next Post