నిజామాబాద్ పసుపునకు గ్లోబల్ బ్రాండ్ - ఎగుమతి హబ్‌గా ఎంపిక
కామారెడ్డికి మహర్దశ - ఆయిల్ పామ్, పౌల్ట్రీకి అంతర్జాతీయ మార్కెట్
ఎగుమతి కేంద్రాలుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు ఎంపిక
(తెలంగాణ డైలీ న్యూస్ స్పెషల్ ✍️)
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జిల్లాను ఎగుమతి కేంద్రంగా మార్చే సమ్మిళిత ఎగుమతి వృద్ధి కార్యక్రమం కింద తెలంగాణలోని 31 జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. గతంలో ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి పథకం ఉండగా దానిని విస్తరించి డిస్ట్రిక్ట్ ఎక్స్‌పోర్ట్ హబ్ కార్యక్రమంగా చేపట్టింది. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లోని రెండు జిల్లాలు ఎగుమతి కేంద్రాలుగా ఎంపిక కావడం విశేషం.
కామారెడ్డి జిల్లా నుండి:
ఆయిల్ పామ్, కోడి మాంసం, కోడిగుడ్లు ఉత్పత్తులను ఎగుమతి ఉత్పత్తులుగా గుర్తించారు. జిల్లాలో సాగవుతున్న ఆయిల్ పామ్ ను అంతర్జాతీయ మార్కెట్ కు తీసుకెళ్లడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కోళ్ల పరిశ్రమకు ఊతం లభించనుంది.
నిజామాబాద్ జిల్లా నుండి:
పసుపు, బియ్యం, విత్తనాలు, చక్కెర ఉత్పత్తులను ఎంపిక చేశారు. నిజామాబాద్ పసుపుకు ఇప్పటికే అంతర్జాతీయంగా డిమాండ్ ఉండగా, తాజా నిర్ణయంతో నిజామాబాద్ పసుపుకు బ్రాండ్ గుర్తింపు లభించి ఎగుమతులు మరింత పెరగనున్నాయి. అలాగే బియ్యం, విత్తన రంగాలకు కూడా ప్రోత్సాహం లభించనుంది.
కేంద్ర, రాష్ట్ర పథకాలు, సంస్థలు, పరిశ్రమలను ఒకే వేదికపైకి తెచ్చి స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ తో అనుసంధానించడం ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర ఎగుమతి ప్రోత్సాహక కమిటీని, జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి జిల్లా నుంచి ప్రత్యేక ఉత్పత్తులను ఎంపిక చేసి వాటికి బ్రాండ్ గుర్తింపు కల్పించి ఎగుమతులకు ప్రోత్సహించనున్నట్లు కేంద్రం తెలిపింది.



Post a Comment