జర్నలిజం పవిత్రమైన వృత్తి, జర్నలిస్టులు నా బిడ్డలాంటి వారు - ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు - మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
వృత్తిలో నైపుణ్యం కోసమే శిక్షణ - వాస్తవాలను నిర్ధారించి రాయాలి
బాన్సువాడలో జిల్లా జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ప్రారంభం
బాన్సువాడ:తెలంగాణ మీడియా అకాడమీ, TUWJ (I) - IJU ఆధ్వర్యంలో బాన్సువాడలో జిల్లా జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. SRNK డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా జర్నలిస్టుల శిక్షణ తరగతుల్లో ప్రముఖులు మాట్లాడారు.
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలిపారు. "పత్రికా విలేకరిగా పని చేయడం కత్తి మీద సాము లాంటిది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధి పాత్ర ఎగ్జిక్యూటివ్ పాత్ర, ప్రెస్ గ్యాలరీలో ఉండే పాత్రికేయుల పాత్ర కూడా జ్యుడీషియల్ పాత్ర అని పేర్కొన్నారు. అసెంబ్లీ లో ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం మాట్లాడితే మీరు రాస్తారు. ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే మీరు ఎత్తి చూపుతారు. వరదలు వచ్చినా, కరువు వచ్చినా వార్తలు కవర్ చేస్తారు. ప్రజలకు సకాలంలో వార్తలు అందిస్తారని ప్రశంసించారు.
నేను హెలికాప్టర్ లో శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి బాన్సువాడకు వచ్చా. శిక్షణ తరగతులు బాన్సువాడలో నిర్వహించడం ప్రశంసనీయం. అన్ని విషయాలు తెలుసుకోవడం పత్రిక ద్వారానే. పత్రికల్లో పక్కా సమాచారం ఉంటుంది. జర్నలిజం పవిత్రమైనది.
జర్నలిస్టులు నా బిడ్డలాంటి వారు. అందుకే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చా. రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చా. కామారెడ్డిలో కూడా ఇస్తానని చెప్పా, స్పీకర్ కావడం వల్ల ఇవ్వలేకపోయా. సంకల్పం మంచిగా ఉండాలి. ఎల్ నినో ప్రభావం గురించి మీరు రాసిన వార్తలు చదివా. రాయడం మీ వంతు, చదవడం మా వంతు" అని అన్నారు.
ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ "ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి జరిగింది. బాన్సువాడలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉన్న బాన్సువాడలో శిక్షణ తరగతులు నిర్వహించడం విలేకరులకు ఎంతో మేలు చేస్తుంది" అని అన్నారు.
"రెండు, మూడు రోజుల పాటు సీనియర్ జర్నలిస్టులతో శిక్షణ ఇప్పిస్తాం. వృత్తిలో నైపుణ్యం సాధించేందుకే ఈ తరగతులు. నాకు తెలియకుండానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించారు. మూడేళ్ల కాలపరిమితి ఉంది.
సోషల్ మీడియా ఆవిర్భావం ఎందుకు జరిగిందో వర్కింగ్ జర్నలిస్టులుగా చర్చించుకోవాలి. ఇటీవల వడ్ల లారీని వెంబడించి నలుగురు పట్టుబడ్డారు. విలేకరులు ఇలాంటి పనులు చేయకూడదు. ప్రజా ప్రయోజనం కోసం ఈ వృత్తిలోకి వచ్చాం. జర్నలిస్టులు స్వచ్ఛందంగా వచ్చారు, వారికి ప్రత్యేకంగా క్వాలిఫికేషన్స్ లేవు. ఒక పోలీసు తప్పు చేస్తే డీజీపీ యాక్షన్ తీసుకుంటారు, మన వృత్తిలో అలా లేదు.
ప్రజల విశ్వాసమే ముఖ్యం. రాసే వార్త వాస్తవమా, అవాస్తవమా చూడాలి. AI గురించి తెలుసుకోవాలి. మీరు మంచిగా నేర్చుకోండి" అని సూచించారు.
సద్వినియోగం చేసుకోవాలి : రజనీ కాంత్
TUWJ (IJU) జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ "బాన్సువాడ జర్నలిస్టుల కోరిక మేరకు ఇక్కడే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఈ తరగతులను అందరూ సద్వినియోగం చేసుకోవాలి" అన్నారు.
SRNK డిగ్రీ కళాశాలలో వర్క్ షాప్ నిర్వహణ గర్వకారణం - ప్రిన్సిపాల్ గంగాధర్
ప్రిన్సిపాల్ గంగాధర్ మాట్లాడుతూ "ఈ వర్క్ షాప్ ను SRNK డిగ్రీ కళాశాలలో నిర్వహించడం మాకు గర్వకారణం" అని అన్నారు. జర్నలిస్ట్ లు ఈ తరగతులను సద్వినియోగించుకోవాలని అన్నారు.
మీడియా ప్రభుత్వానికి, ప్రజలకు వారధి - ఆర్డీఓ రవీందర్ రెడ్డి
ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ "మీడియా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటుంది. గతంలో బాబుల్ గాం, బాదల్ గాం అనే వార్త వల్ల ఆ గ్రామస్తులకు ఎంతో ప్రయోజనం జరిగింది. విలేకరులు ఇలాంటి మంచి పనులు చేయాలి" అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిజీ ఆగ్రో మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, iju కౌన్సిల్ సభ్యులు సేపూరి వేణుగోపాల్ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ ఏ లతీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పట్నం శ్రీనివాస్, కార్యదర్శి బైరి సుధాకర్ గౌడ్, జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ కాలనీ లో పర్యటన
అంతకు ముందుకు ఎమ్మెల్యే పోచారం, మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జర్నలిస్ట్ కాలనీ లో పర్యటించారు. ఈ సందర్బంగా జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం, కాలనీ లో జరిగిన అభివృద్ధి పట్ల ఆయన పోచారం ను ప్రశంసించారు. ఈ సందర్బంగా అనారోగ్యం తో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్ట్ వై వీ ప్రసాద్ ను పరామర్శించారు.














Post a Comment