National Integral Conference |హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు కలిసి ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే పోచారం

హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు కలిసి ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ వేదికగా సరికొత్త సంస్కృతి - ఇది మైనారిటీ, మెజారిటీ సభ కాదు సిన్సియారిటీ సభ

అల్లా, కృష్ణ, ఏసుక్రీస్తు, గురునానక్ అందరూ ఒకటే - ప్రేమతో జీవించండి : డా. యజ్ఞం పవన్ కుమార్ శర్మ

బాన్సువాడలో చరిత్రాత్మక జాతీయ సమైక్యతా సదస్సు ఘనంగా నిర్వహణ

బాన్సువాడ, సెప్టెంబర్ 28: మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజి) కొయగుల్ల, బాన్సువాడ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ గంజ్ లో చరిత్రాత్మక ఖౌమీ ఏకజేహతీ కాన్ఫరెన్స్ - జాతీయ సమైక్యతా సదస్సు ఘనంగా జరిగింది. మదర్సా నాజిమ్ ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా ఖాస్మీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ మత పెద్దలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, హజ్రత్ మౌలానా మొహమ్మద్ హుసాముద్దీన్ జాఫర్ పాషా సాహెబ్ హుస్సామి (అమీర్, మిల్లతె ఇస్లామియా), హిందూ ధర్మ ప్రముఖులు డా. యజ్ఞం పవన్ కుమార్ శర్మ, పాస్టర్ రాజేశ్వర్ సోలేమాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మౌలానా గులాం యజ్దాని సాహెబ్ పర్యవేక్షణలో, హాఫిజ్ లయీఖ్ ఖాన్ అధ్యక్షతన, హాఫిజ్ ఫహీముద్దీన్ మునీరి నిర్వహణలో జరిగింది.

ప్రపంచం బాన్సువాడ వైపు చూసేలా కార్యక్రమం - ఎమ్మెల్యే పోచారం

సదస్సులో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ "నిర్వహణ ఎంతో బాగుంది. ప్రపంచం మొత్తం బాన్సువాడ వైపు చూసే కార్యక్రమం ఇది" అని కొనియాడారు.

"బోధన్ కు చెందిన ఒక అమ్మాయి ఖురాన్, భగవద్గీత రెండింటినీ తీసుకొని వచ్చి రెండింటిలో ఒక్కటే ఉందని చెప్పింది. మెచ్చుకొని ఆ అమ్మాయికి రుద్రూర్ లో డబుల్ బెడ్ రూం ఇల్లు, రూ. 50 వేలు ఇచ్చాను. మన మనసులో ప్రేమ ఉండాలి, దీన్ని కొనలేం. చంద్రుడు, భూమి, నీరు అన్నీ అన్ని మతాల వారివే. రక్తం అవసరమైనప్పుడు హిందూ, ముస్లిం అని చూడం. డబుల్ బెడ్ రూం ఇళ్లు నేను హిందూ, ముస్లింలకు సగం సగం ఇచ్చాను. దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ కలిసి ఉండాలి" అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధికి కృషి చేశానన్నారు.

ఇది మైనారిటీ సభ కాదు, సిన్సియారిటీ సభ - డా. యజ్ఞం పవన్ కుమార్ శర్మ

డా. యజ్ఞం పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ "ఇది ముస్లింల సదస్సు కాదు, హిందువుల సదస్సు కాదు. భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలబెట్టాలనే ఉద్దేశంతో జరిగిన సదస్సు. తెలంగాణ భారత్ లో విలీనానికి అష్ఫాకుల్లా ఖాన్, షేక్ బందగీ త్యాగం ఉంది. అబ్దుల్ కలాంను ప్రథమ పౌరుడిగా చేసిన దేశం మనది.

బాన్సువాడలో వివేకానంద కల్చర్, వసుధైక కుటుంబం అనే నవభారత్ కల్చర్ ను ప్రవేశపెట్టాం. అల్లా, కృష్ణ, ఏసుక్రీస్తు, గురునానక్ అందరూ ఒకటే. ప్రేమతో జీవించండి. ఇది మైనారిటీ సభ కాదు, మెజారిటీ సభ కాదు, ఇది సిన్సియారిటీ సభ" అన్నారు. అమీరే మిల్లత్ మౌలానా జాఫర్ పాషా మాట్లాడుతూ ఇస్లాం శాంతిని బోధిస్తుందని, అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలని ఖురాన్ లో అల్లాహ్ బోధించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు అమృతం వీరబ్రహ్మం, జామా మసీదు అధ్యక్షులు రిజ్వాన్, హఫీజ్ మహ్మద్ లాయక్, మహ్మద్ ఏజాజ్, ఏసుదాస్, జుబేర్, ఎర్వల కృష్ణారెడ్డి, అలీ బిన్ అబ్దుల్లా, వహాబ్, పెద్ద హనుమాన్ మందిర్ కమిటీ రుద్రంగి అశోక్, మోచి గణేష్ తదితరులు పాల్గొన్నారు.




















Post a Comment

Previous Post Next Post