Media Workshop | ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర: కలెక్టర్

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

పీఐబీ ఆధ్వర్యంలో 'వార్తాలాప్' వర్క్‌షాప్

కామారెడ్డి, సెప్టెంబర్ 16: ప్రభుత్వ పథకాలు, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

పత్రికా సమాచార కార్యాలయం (PIB), హైదరాబాద్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బుధవారం నిర్వహించిన ‘వార్తాలాప్’ మీడియా వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమర్థవంతమైన కమ్యూనికేషన్ అవసరమన్నారు. ఈ వర్క్‌షాప్‌లో 'నషా ముక్త్ భారత్ అభియాన్', 'సైబర్ సెక్యూరిటీ' అనే రెండు అంశాలపై చర్చ జరిగింది.

మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం:

ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని, యువతకు అవగాహన కల్పించడంలో మీడియా కీలకమని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద్ రెడ్డి అన్నారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత:

సీ-డాక్ సీనియర్ సైంటిస్ట్ జగదీష్ బాబు మాట్లాడుతూ సైబర్ ముప్పులు, ఆన్‌లైన్ భద్రతపై ప్రజలను చైతన్యపరచాలని, సురక్షిత డిజిటల్ పద్ధతులు పాటించాలని సూచించారు.

పీఐబీ జాయింట్ డైరెక్టర్ డా. మనస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ టైర్-2, టైర్-3 నగరాల ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, పీఐబీ మీడియా & కమ్యూనికేషన్ ఆఫీసర్ శివచరణ్ రెడ్డి, జిల్లాలోని సీనియర్ జర్నలిస్ట్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.







Post a Comment

Previous Post Next Post