Top News

Santhosh Arrest | యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

 రోజున్నరలోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు

ప్రతీకార హత్య - చిత్తారి హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం - కారు, కత్తులు స్వాధీనం, మరో ముగ్గురి కోసం గాలింపు : పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్, రిపోర్టర్ తాజ్/తెలంగాణ డైలీ న్యూస్ : చిత్తారి హరిబాబు హత్య కేసులో ప్రధాన నిందితుడు A-1 గంధం సంతోష్ ను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య వెల్లడించారు.

తేదీ 17.09.2026న చిత్తారి లక్ష్మి తన కొడుకు చిత్తారి హరిబాబు హత్యకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజామాబాద్ II టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైం నెం. 169/2026, U/s 103(1) r/w 3(5) BNS కింద హత్య కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయిన వెంటనే కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్, టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు.


కేసు నేపథ్యం:

గత 17.03.2026న హరిబాబు భార్య గంధం వైష్ణవి హత్యకు గురైన కేసులో కోరుట్ల పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో హరిబాబు, అతని తల్లి లక్ష్మి,  ఇద్దరు సోదరులు అరెస్టై కరీంనగర్ జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలయ్యారు. విడుదల తర్వాత వైష్ణవి కుటుంబ సభ్యుల నుండి ప్రాణభయం ఉందని భావించి హరిబాబు, తల్లి లక్ష్మి నిజామాబాద్ కు వచ్చి సాయినగర్ లో నివసిస్తూ ఆర్.ఆర్. చౌరస్తా సమీపంలో మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వైష్ణవి హత్యను మనసులో పెట్టుకుని ప్రతీకారంతో A-1 గంధం సంతోష్ తన తల్లి గంధం రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్,  ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో 17.09.2026 సాయంత్రం 5 గంటలకు కోరుట్ల నుండి తెలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ కారు నెం. TS-36A-4843లో నిజామాబాద్ కు వచ్చాడు.

ఆర్.ఆర్. చౌరస్తా సమీపంలోని గిరిరాజ్ కాంప్లెక్స్ ఎదుట పానీపూరి బండి వద్ద హరిబాబు నీరు తీసుకుంటున్న సమయంలో కారులోని కుడివైపు వెనుక డోర్ నుండి దిగి కత్తితో తల, ముఖం, మెడపై పలుమార్లు దాడి చేసి అదే కారులో పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు, సాంకేతిక ఆధారాల ద్వారా వెల్లడైంది.

నిందితుల ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టగా, నమ్మకమైన సమాచారం మేరకు నిజామాబాద్ ఔటర్ బైపాస్ లో A-1 సంతోష్ ఉన్నట్లు గుర్తించారు. ఈరోజు 19.09.2026న పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయేందుకు యత్నించాడు. అదుపులోకి తీసుకుని విచారించగా కీలక సమాచారం లభించింది. కారు వదిలేసి తన అత్తగారి ఊరు విశాఖపట్నం వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్తుండగా పట్టుబడ్డాడు. హత్యకు ఉపయోగించిన కత్తి, స్విఫ్ట్ డిజైర్ కారు, కారులో ఉన్న మరో రెండు కత్తులు, రెండు కర్రలను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు, ఈ కేసులో ప్రాథమికంగా నలుగురి ప్రమేయం నిర్ధారణ కావడంతో మిగిలిన వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు. పరారీలో ఉన్న మిగతా వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

హత్య జరిగిన రోజున్నరలోనే నిందితుడిని అరెస్ట్ చేసిన ఏసీపీ ప్రకాష్, సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్ఐ యాదగిరి గౌడ్ మరియు సిబ్బందిని కమిషనర్ అభినందించారు. కోర్టులో శిక్ష పడేలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు.





ఫైల్ ఫొటోస్ 

Post a Comment

Previous Post Next Post