10 Years Completed | కామారెడ్డి జిల్లాకు దశాబ్దం..!

కామారెడ్డి జిల్లాకు దశాబ్దం..! 

ఒకప్పుడు ఉప జిల్లా - నేడు రాష్ట్ర రాజకీయ కేంద్రం..!!

-పదేళ్లు పూర్తి అయిన సందర్బంగా ప్రత్యేక కథనం 

కామారెడ్డి/తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో 

తెలంగాణ పటంపై 2016 అక్టోబర్ 11న కొత్తగా ఆవిష్కృతమైన 21 జిల్లాల్లో కామారెడ్డి ఒకటి. నిజామాబాద్ నుంచి విడివడి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ జిల్లా నేడు పరిపాలనలో, వ్యవసాయంలో, పరిశ్రమల్లో స్థిరపడి - రాజకీయంగా మాత్రం దేశం దృష్టిని ఆకర్షించిన హాట్ స్పాట్ గా మారింది.

ఆవిర్భావం నుంచి ఆధునికత వరకు...

కామారెడ్డి ప్రాంత ప్రజల దశబ్దాల కలను నిజం చేస్తూ అప్పటి ముఖమంత్రి కెసిఆర్ హయాంలో జీవో నెం 224 ప్రకారం ఏర్పడిన ఈ జిల్లాకు పేరు వెనుక 400 ఏళ్ల చరిత్ర ఉంది. దోమకొండ కోటను ఏలిన చిన్న కామిరెడ్డి పేరు మీదుగా, పూర్వం కోడూరుగా పిలిచే ప్రాంతమే నేటి కామారెడ్డి. 3,652 చ.కి.మీ విస్తీర్ణం, 10 లక్షల జనాభా, NH-44పై జిల్లా కేంద్రం. ఉత్తరాన నిజామాబాద్, తూర్పున సిరిసిల్ల-సిద్ధిపేట, దక్షిణాన మెదక్-సంగారెడ్డి, పశ్చిమాన మహారాష్ట్ర నాందేడ్, కర్ణాటక బీదర్ సరిహద్దులు. జిల్లా మీదుగా NH-44, NH-161, NH-765D జాతీయ రహదారులు వెళ్తాయి.

పరిపాలన పరంగా 3 డివిజన్లు, 25 మండలాలు, 532 రెవెన్యూ గ్రామాలు.

- కామారెడ్డి డివిజన్ (10): కామారెడ్డి, భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, మాచారెడ్డి, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి,పాల్వంచ 

- బాన్సువాడ డివిజన్ (11):బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లి, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్ద కొడప్ గల్, పిట్లం,  మహ్మద్ నగర్, నిజాంసాగర్ 

- ఎల్లారెడ్డి డివిజన్ (4): ఎల్లారెడ్డి, గాంధారి, లింగంపేట్, నాగిరెడ్డిపేట

మున్సిపాలిటీలు : కామారెడ్డి, బాన్సవాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద 

ప్రస్తుత కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర నేతృత్వంలో జిల్లా యంత్రాంగం అభివృద్ధిలో దూసుళ్తున్నది. వైద్యంలో రాష్ట్రంలోనే టాప్-3లో నిలిచింది. ఈ-సంజీవని టెలి మెడిసిన్ లో 36,916 కన్సల్టేషన్స్ తో 3వ స్థానం, ఎన్సీడీ స్క్రీనింగ్ లో 2వ స్థానం.

జీవనాడులు - ప్రాజెక్టులు:

జిల్లాకు ప్రాణం నిజాంసాగర్. ఈ ఏడాది 11.7 టీఎంసీలతో 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు. దీనికి తోడు పోచారం ప్రాజెక్టు, జుక్కల్ లోని కౌలాస్ నాలా ప్రాజెక్టు. కాళేశ్వరం ప్యాకేజీల ద్వారా ఎగువ ప్రాంత బాన్సువాడకు గోదావరి జలాలు తెచ్చే ప్రణాళిక దశాబ్ది కల.

పంటల పొలం-వ్యవసాయం:

91% చిన్న సన్నకారు రైతులు, సగటు కమతం 1.53 ఎకరాలు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, చెరకు, సోయా, పప్పుధాన్యాలు. రాష్ట్రంలోనే వరి, సోయాలో టాప్. మల్తూమ్మెదలో 324 హెక్టార్ల రాష్ట్ర విత్తన క్షేత్రం. ఇప్పుడు కొత్త అధ్యాయం - తాడ్వాయిలో 67,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం.

పరిశ్రమల్లో పరుగు:

గాయత్రి షుగర్స్ 2 ఫ్యాక్టరీలు, వందలాది రైస్ మిల్లులు, 318 వస్త్ర వ్యాపార కేంద్రాలు, రాష్ట్రంలోనే అతిపెద్ద పౌల్ట్రీ హబ్. తాజాగా 1,000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ SEZ ప్రతిపాదన. దావోస్ పర్యటన తర్వాత యూనిలీవర్ పామాయిల్ రిఫైనరీని కామారెడ్డిలో పెట్టేందుకు ముందుకొచ్చింది.

రాజకీయ హాట్ స్పాట్:

4 అసెంబ్లీ స్థానాలు, జహీరాబాద్ లోక్ సభ పరిధి.

2023 ఎన్నికలు కామారెడ్డిని దేశం మొత్తం చూసేలా చేశాయి. ఒకే నియోజకవర్గంలో అప్పటి సీఎం కేసీఆర్, భావి సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీకి చెందిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోటీ. చివరకు కాటిపల్లి గెలుపు - ఇది రాష్ట్ర రాజకీయ చరిత్రలో సంచలనం.

ప్రస్తుత ప్రజాప్రతినిధులు:

- కామారెడ్డి: కాటిపల్లి వెంకట రమణారెడ్డి (బీజేపీ)

- బాన్సువాడ: పోచారం శ్రీనివాస్ రెడ్డి 

- ఎల్లారెడ్డి: మదన్ మోహన్ రావు (కాంగ్రెస్)

- జుక్కల్ (SC): తోట లక్ష్మీ కాంతారావు (కాంగ్రెస్)

- జహీరాబాద్ ఎంపీ: సురేష్ షెట్కార్ (కాంగ్రెస్)

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీ తనదైన శైలిలో జిల్లాలో ముందుకు సాగుతున్నారు.

ఒకప్పుడు బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న జిల్లా ఇప్పుడు కాంగ్రెస్-బీజేపీ-బీఆర్ఎస్ త్రిముఖ పోటీకి వేదిక. 10 ఏళ్లలో మౌలిక వసతులు, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ సాధించినా, పరిశ్రమల కొరత, యువత వలస, నిజాంసాగర్ ఆధునీకరణ ఇంకా పెండింగ్ సమస్యలు.

దశాబ్ది కామారెడ్డి - పుట్టింది నిజామాబాద్ నుంచి, పెరిగింది తెలంగాణ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగింది.





1 Comments

Post a Comment

Previous Post Next Post