AI Review | పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతం

పోలీస్ శాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతం - సీపీ ఆదేశాలతో సమీక్ష

నేర విశ్లేషణ నుండి ట్రాఫిక్ నిర్వహణ వరకు ఏఐ సేవలు

విద్యాసంస్థలతో కలిసి నిజామాబాద్ పోలీస్ వినూత్న ప్రయోగం

నిజామాబాద్, అక్టోబర్ 8:

పోలీస్ శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవలను మరింత విస్తృతంగా వినియోగించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నిర్ణయించింది.

పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు గురువారం కమిషనరేట్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నగరంలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్లు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

ఏఐతో వేగవంతమైన, పారదర్శక పోలీసింగ్

పోలీసింగ్‌ను మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏఐని ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. ముఖ్యంగా..

- నేరాల విశ్లేషణ, నేర నివారణ, క్రైమ్ డేటా అనాలిసిస్

- అనుమానాస్పద కార్యకలాపాల గుర్తింపు

- ట్రాఫిక్ నిర్వహణ, సీసీటీవీ ఫుటేజీ విశ్లేషణ

- సైబర్ నేరాల దర్యాప్తు, సోషల్ మీడియా మానిటరింగ్

- ప్రజలకు వేగవంతమైన పోలీస్ సేవలు అందించడం

వంటి అంశాల్లో ఏఐ సాంకేతికతను ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలించారు.

పోలీస్ సిబ్బందికి ఏఐ పై ప్రత్యేక శిక్షణ, సాంకేతిక నైపుణ్యాల పెంపు, కళాశాలల సహకారంతో పోలీస్ శాఖకు ఉపయోగపడే ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌లు, అప్లికేషన్ల అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించారు.

ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ శుభం ప్రకాష్ మాట్లాడుతూ.. విద్యాసంస్థలు, సాంకేతిక నిపుణులు, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ప్రజా భద్రతకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని అన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా ఆధునికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో నవ్య భారతి జాయింట్ సెక్రటరీ డా. శిరీష్, విజయ రూరల్ ఇంజినీరింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డా. ఎన్. స్వప్న, ఫ్యాకల్టీ సుజాత, నవ్య, లక్ష్మి, కాకతీయ కళాశాల నుండి డి. వేణుగోపాల్, పి. నాగార్జున, క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. శ్రీనివాస్, సి.ఓ.డి ఎం. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post