పత్తి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు - రైతులకు ఇబ్బందులు వద్దు: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
క్వింటాల్ కు రూ.8,667 మద్దతు ధర - జిల్లాలో 8 కేంద్రాల్లో కొనుగోళ్లు
కామారెడ్డి, అక్టోబర్ 7: పత్తి కొనుగోళ్లను సజావుగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో కొనుగోలు కేంద్రాలు, రైతులకు సౌకర్యాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్ లో పత్తికి క్వింటాల్ కు రూ.8,667 కనీస మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని, తేమ శాతం, నాణ్యతను బట్టి ధరలో మార్పు ఉంటుందని తెలిపారు. రైతులు పత్తిని ఇంటి వద్దనే బాగా ఆరబెట్టి నాణ్యతా ప్రమాణాలతో కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
రైతుల సమస్యల పరిష్కారానికి మార్కెటింగ్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800-599-5779, CCI వాట్సాప్ చాట్ బాట్ 88972-81111ను సంప్రదించాలని తెలిపారు. గత ఏడాది మాదిరిగానే కపాస్ కిసాన్ యాప్ ద్వారా మద్నూర్ లో 7, గాంధారిలో 1 జిన్నింగ్ మిల్లులో పత్తి విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.
జిల్లాలో 67 రైతు వేదికల్లో తేమ కొలిచే పరికరాలు ఏర్పాటు చేస్తామని, రైతులు కేంద్రాలకు వెళ్లే ముందే తేమ శాతాన్ని అక్కడ పరీక్షించుకోవచ్చని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ వై గిరి, మార్కెటింగ్ అధికారి రమ్య, వ్యవసాయ అధికారి విజయభారతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment