ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ఇందిరమ్మ ఇళ్ల మార్కౌట్, VB-G RAM G పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, అక్టోబర్ 26: కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ రోజు మొత్తం 79 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజావాణి అనంతరం అన్ని మండలాల MPDO లతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మార్కౌట్ ప్రక్రియను వేగవంతం చేయాలని, VB-G RAM G (గతంలో ఉపాధి హామీ) పథకం కింద చేపట్టిన పనుల్లో ప్రతి చోట 20 నుంచి 30 మంది కూలీలతో పనులు నిర్వహించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించకుండా నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి. విక్టర్, ఎన్.వై. గిరి, జెడ్పీ సీఈఓ చందర్, డీఆర్ఓ పాండు తదితరులు పాల్గొన్నారు.
----------------------
మహర్షి వాల్మీకి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, అక్టోబర్ 26: జిల్లా కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ధర్మం, మానవతా సూత్రాలకు ప్రతీక అని పేర్కొన్నారు. వాల్మీకి జీవితం, బోధనలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలు, సమానత్వం, మానవతా భావాలను పెంపొందించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, జెడ్పీ సీఈఓ చందర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, సహాయ అధికారి చక్రధర్, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నీల నాగరాజు, ఎంబీసీ నాయకులు శ్రీనివాస్, జనార్ధన్, గణేశ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



Post a Comment