కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మహమ్మద్ అలీ షబ్బీర్
వారం రోజుల్లో ప్రైవేట్ క్రికెట్ కోచ్ల నియామకం - మూడు ప్రాక్టీస్ నెట్స్ ఏర్పాటు
కామారెడ్డి, అక్టోబర్ 26: కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియాన్ని క్రికెట్ క్రీడాభివృద్ధికి అనువుగా తీర్చిదిద్ది స్థానిక యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
కామారెడ్డి యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రికెటర్లను తయారు చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
సోమవారం ఇందిరాగాంధీ స్టేడియాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కార్యదర్శి జీవన్ రెడ్డి, HCA సీఈఓ ఇంతియాజ్ ఖాన్ లతో కలిసి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. స్టేడియంలోని ప్రస్తుత సౌకర్యాలు, పిచ్ నిర్మాణం, ప్రాక్టీస్ నెట్స్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ....కామారెడ్డి ప్రాంతంలో క్రికెట్ కు మంచి ఆదరణ ఉందని, సరైన శిక్షణ, ఆధునిక సౌకర్యాలు అందిస్తే ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని అన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రతిభ ఉన్న విద్యార్థులు నాణ్యమైన శిక్షణకు దూరం కాకూడదని, స్థానికంగానే మెరుగైన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అభివృద్ధికి దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని, నేటి యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. HCA సహకారంతో మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ప్రైవేట్ కోచ్ ల నియామకం, మూడు ప్రాక్టీస్ నెట్స్, క్రికెట్ సామగ్రి సమకూర్చడం వంటి చర్యలతో నాణ్యమైన శిక్షణ అందిస్తామని తెలిపారు. నాణ్యమైన పిచ్ నిర్మాణం చేపట్టి HCA ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు, అండర్-19 మ్యాచ్ లు నిర్వహించేలా కృషి చేస్తామని అన్నారు.
HCA కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
ప్రభుత్వ సలహాదారు సూచనల మేరకు వారం రోజుల్లోగా ప్రైవేట్ క్రికెట్ కోచ్ లను నియమిస్తామని, మూడు నెట్స్ ఏర్పాటు చేసి అవసరమైన సామగ్రి అందజేస్తామని తెలిపారు. త్వరలో జరిగే HCA సమావేశంలో పిచ్ నిర్మాణం, స్టేడియాన్ని HCA ఆధీనంలోకి తీసుకుని నిర్వహణ చేపట్టడం, అండర్-19 మ్యాచ్ ల నిర్వహణపై చర్చిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, పీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






Post a Comment