కామారెడ్డిలో ఐదేళ్ల తర్వాత అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
కామారెడ్డి, 21 అక్టోబర్: కామారెడ్డి పట్టణంలో ఐదేళ్ల విరామం తర్వాత దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో షబ్బీర్ అలీ ఫౌండేషన్, దసరా ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి, మాజీ ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కామారెడ్డి పట్టణంలో గత 36 సంవత్సరాలుగా షబ్బీర్ అలీ ఫౌండేషన్, దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ప్రజలందరూ కులమతాలు, రాజకీయాలకు అతీతంగా కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావం, ఇతర పరిస్థితుల కారణంగా గత ఐదేళ్లుగా దసరా ఉత్సవాలను నిర్వహించలేకపోయామని, ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
విజయదశమి పండుగ చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక అని, దుర్గాదేవి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ జరుపుకునే ఈ పండుగ ప్రజల్లో ధైర్యం, విశ్వాసం, న్యాయం, ధర్మం పట్ల నిబద్ధతను పెంపొందిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు.
దసరా పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, ఇలాంటి పండుగలు ప్రజల మధ్య స్నేహభావాన్ని, పరస్పర గౌరవాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. తెలంగాణ గంగా జమునా తెహజీబ్ సంప్రదాయానికి అనుగుణంగా అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో పండుగలను జరుపుకోవడం మన సమాజ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఈ విజయదశమి సందర్భంగా అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించామని, రైతులు, కార్మికులు, యువత, మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.







Post a Comment