హన్మాజీపేట్లో ఘనంగా దుర్గామాత నిమజ్జనం.. ప్రతి ఇంటికి పూల మొక్కల పంపిణీ
బాన్సువాడ, అక్టోబర్ 21: బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. బుధవారం దుర్గామాత నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ ఆశగోని లావణ్య వెంక గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి వీడ్కోలు పలికారు. భవానీమాత మాలాధారణ స్వాములు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి నామస్మరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపారు.
ప్రతి ఇంటికి పూల మొక్క..
ఈ నిమజ్జన కార్యక్రమంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పర్యావరణ పరిరక్షణ, ప్రతి ఇంట్లో పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో గ్రామంలోని ప్రతి ఇంటికి ఒక పూల మొక్కను సర్పంచ్ లావణ్య వెంక గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో పచ్చదనంపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో దుర్గామాత నిమజ్జన కార్యక్రమం వైభవంగా ముగిసింది.

Post a Comment