Different News | కామారెడ్డిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు : ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో గుడ్ల సరఫరా టెండర్ల సాంకేతిక బిడ్ల పరిశీలన పూర్తి

కామారెడ్డి, అక్టోబర్ 13: కామారెడ్డి జిల్లాలోని సంక్షేమ, గురుకుల వసతి గృహాలకు గుడ్ల సరఫరా టెండర్ల సాంకేతిక బిడ్ల పరిశీలన మంగళవారం పూర్తయింది.  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, సంబంధిత కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

టెండర్లలో పాల్గొన్న సంస్థలు సమర్పించిన సాంకేతిక బిడ్లు, ధ్రువపత్రాలను నిర్దేశిత అర్హత ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల మేరకు కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. తదుపరి ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

జిల్లాలోని అన్ని సంక్షేమ, గురుకుల హాస్టళ్లకు గుడ్ల సరఫరా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

---------------------

బిచ్కుంద మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు అక్టోబర్ 16న లక్కీ డ్రా

కామారెడ్డి, అక్టోబర్ 13: బిచ్కుంద మున్సిపాలిటీలో నూతన బార్ ఏర్పాటుకు సంబంధించి లక్కీ డ్రా ఈ నెల 16న నిర్వహించనున్నట్లు జిల్లా ఆబ్కారీ అధికారి బి. ముకుంద రెడ్డి తెలిపారు.

నూతన బార్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 12వ తేదీతో ముగిసిందని, మొత్తం 90 దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.

బార్ కేటాయింపు ప్రక్రియను అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా పద్ధతిలో పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.

దరఖాస్తుదారులు తమకు జారీ చేసిన రసీదులతో అదే రోజు ఉదయం 10 గంటలకు కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) లోని ప్రధాన సమావేశ మందిరానికి హాజరు కావాలని ఆబ్కారీ అధికారి సూచించారు.

-------------------

సదాశివనగర్ మండలంలో ఫుడ్ సేఫ్టీ అధికారి ఆకస్మిక తనిఖీలు

కామారెడ్డి, అక్టోబర్ 13: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో ఆహార భద్రతా అధికారి జి. విక్రమ్ మంగళవారం పలు చిల్లర దుకాణాలు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో కొన్ని దుకాణాల్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను గుర్తించి వెంటనే తొలగించి పారవేయించారు. నాణ్యతపై అనుమానం ఉన్న పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు.

అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేదా నమోదు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న పలు సంస్థలను గుర్తించి నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి ఆహార వ్యాపారి తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ కలిగి ఉండాలని, ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యత లోపం ఉన్న ఆహారం విక్రయిస్తే ఆహార భద్రతా శాఖకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

---------------

కామారెడ్డిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు - అక్టోబర్ 21 నుండి 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే 

కామారెడ్డి, అక్టోబర్ 13: దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కామారెడ్డి జిల్లాలో అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.

అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులు అర్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

31 వరకు ఓపెన్ హౌస్, రక్తదాన శిబిరాలు, అవగాహన ర్యాలీలు, అమరవీరుల కుటుంబాల పరామర్శ, కళాబృందం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ అంశాలపై వ్యాసరచన పోటీలు, యువతకు షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తామని, జిల్లా స్థాయిలో ఎంపికైన ఉత్తమ 3 ఎంట్రీలను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు.

పోటీల్లో పాల్గొనేవారు తమ ఎంట్రీలను అక్టోబర్ 24 లోపు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్ విభాగంలో రవి కుమార్ (9963308978) కు అందజేయాలని ఎస్పీ సూచించారు.

Post a Comment

Previous Post Next Post