Road Terror -765-D | డెత్ ట్రాప్ గా మారిన డిజైన్

File Photos 
765-D జాతీయ రహదారి డిజైన్ లోపం - జరుగుతున్న ప్రమాదాలు, గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు

6 నెలల్లో 12 మంది చనిపోయి, 60 మందికి పైగా క్షతగాత్రులయ్యారని సర్పంచుల వెల్లడి 

ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ కు నసురుల్లాబాద్ సర్పంచులు, ప్రజాప్రతినిధుల వినతి

765-D డెత్ ట్రాప్ గా మారిన డిజైన్

తెలంగాణ డైలీ న్యూస్ - బాన్సువాడ 

కామారెడ్డి జిల్లాలో రూ.898 కోట్లతో మెదక్ నుంచి రుద్రూర్ వరకు 96 కి.మీ నిర్మిస్తున్న D-765 హైవే అభివృద్ధి పేరుతో ప్రాణాలు తీస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నసురుల్లాబాద్ మండలంలోనే గత 6 నెలల్లో 12 మంది చనిపోయి, 60 మందికి పైగా క్షతగాత్రులయ్యారని స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొనడం కలకలం రేపుతోంది.

కామారెడ్డి జిల్లాలో నిర్మాణం జరుగుతున్న డి 765 రహదారి నిర్మాణ పనులు సక్రమంగా లేక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని నసురుల్లాబాద్ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు సోమవారం ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

అసలు లోపం ఏంటి? - 10 మీటర్ల ఇరుకు రోడ్డు + జాలీల డెత్ ట్రాప్

క్షేత్రస్థాయిలో సర్పంచ్ల బృందం సేకరించిన సమాచారం ప్రకారం:

సర్వీస్ రోడ్డు ఉన్నచోట ప్రధాన రహదారి వెడల్పు కేవలం 10 మీటర్లకు కుదించారు. ఆ 10 మీటర్లకు ఇరువైపులా డ్రైనేజీ తవ్వి దానిపై ఇనుప జాలీలు వేశారు. రెండు వైపుల నుంచి వచ్చే భారీ వాహనాలు, బైకులు అదే ఇరుకు లేన్ లో వెళ్లాల్సి వస్తోంది. 

పక్కకు తప్పుకునేందుకు బెర్మ్ లేదు, షోల్డర్ లేదు. పొరపాటున ఓవర్ టేక్ చేసినా, ఎదురుగా వాహనం వస్తే తప్పించుకునే మార్గం లేక జాలీలపైనే బైకులు స్లిప్ అయి కిందపడుతున్నాయి. జాలీలు ఉన్నచోటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని సర్పంచులు చెబుతున్నారు.

గ్రామాలు లేని నిర్జన ప్రదేశాల్లో కూడా ఇదే డిజైన్ అమలు చేయడం వల్ల రోడ్డు మరింత ప్రమాదకరంగా మారింది.

రెండో కోణం - మురుగు సమస్య:

మెయిన్ రోడ్డు, సర్వీస్ రోడ్డు మధ్యలో డ్రైనేజీ పెట్టడం వల్ల వర్షపు నీరు, మురుగునీరు బయటకు వెళ్లడం లేదు. నీరు నిలిచి సర్వీస్ రోడ్డు బురదమయం అవుతోంది, దుర్గంధం, దోమల బెడద పెరిగిందని స్థానికులు వాపోతున్నారు.

సర్పంచుల డిమాండ్ ఏంటి?

> జాలీల డిజైన్ రద్దు చేసి మధ్యలో డివైడర్ తో ఫోర్-లేన్ చేయాలి

> డ్రైనేజీని రోడ్డు చివరకు మార్చాలి

> నిర్జన ప్రాంతాల్లో అనవసర జాలీలు తొలగించి మట్టి బెర్మ్ ఏర్పాటు చేయాలి

"రోడ్డు అభివృద్ధి ప్రజల సౌకర్యం కోసం కావాలి, ప్రాణాలు తీయడానికి కాదు" అని నసురుల్లాబాద్ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించాలని నెంలి సర్పంచ్ రాంగోపాల్ రెడ్డి 'తెలంగాణ డైలీ న్యూస్ ' తో పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ స్పందించి, నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్ తో సమీక్ష నిర్వహించి డిజైన్ లోపాన్ని సరిచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post