ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా.. జర భద్రం! పోలీసులకు సమాచారం ఇవ్వండి: కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర
దసరా ప్రయాణాల్లో వేగం పెంచి ప్రమాదాన్ని ఆహ్వానించొద్దు
కామారెడ్డి, 17 అక్టోబర్: దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఇంటి భద్రత, ప్రయాణ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ సూచించారు.
ఇంటికి వేసిన తాళం దొంగలకు ఆహ్వానం కాకూడదని, ఊరెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని, నాణ్యమైన తాళాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నమ్మకమైన పొరుగువారికి సమాచారం ఇచ్చి ఇంటిని గమనించాలని కోరాలని, ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో బహిరంగంగా వెల్లడించవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు ధరించాలని, పరిమిత వేగంతో వాహనాలు నడపాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అలసటగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలని, రాత్రివేళ మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

Post a Comment