పగటిపూట ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
నిజామాబాద్ లో ఘరానా దొంగల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు
11 కేసుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్న నిందితులు
విలేకరుల సమావేశంలో పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య
నిజామాబాద్, నవంబర్ 4: పగటిపూట తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, కారు, నకిలీ నంబర్ ప్లేట్లు, దొంగతనానికి ఉపయోగించే ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు.
అరెస్ట్ అయిన నిందితులు మహారాష్ట్ర బుల్డానా జిల్లా జవహర్ నగర్ కు చెందిన సయ్యద్ షకీల్ వయసు 46, షేక్ అహ్మద్ అలియాస్ రాజు వయసు 37, షేక్ ఇమ్రాన్ వయసు 32 గా గుర్తించారు. వీరిలో ప్రధాన సూత్రధారి సయ్యద్ షకీల్. గతంలో వరంగల్, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాలు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి 30 గ్రాముల బంగారు నెక్లెస్, బంగారు ఉంగరాలు, బంగారు బిస్కెట్, వెండి కడియాలు, వెండి పట్టా గొలుసులు, వెండి గాజులు, 5 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు ఉపయోగించిన హోండా సిటీ కారు విలువ 5 లక్షల రూపాయలుగా అంచనా వేశారు. నకిలీ నంబర్ ప్లేట్లు ఎంహెచ్ 02 సిబి 8121, ఎంహెచ్ 02 డిఎస్ 6841, టిఎస్ 07 జిఏ 4081 మూడు వేర్వేరు సైజుల ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు.
నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 4న మధ్యాహ్నం ఫిర్యాదిదారుడు మహమ్మద్ నవిదుద్దీన్ ఇంటికి తాళం వేసి హోటల్ కు వెళ్లగా తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి బంగారు, వెండి, నగదు దొంగిలించారని ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో బుల్డానా ముఠా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. నవంబర్ 4న నిజామాబాద్ వైపు వస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో నవీపేట్ ఏరియాలో ఉదయం 11 గంటలకు వారిని పట్టుకున్నారు.
విచారణలో నిందితులు నవీపేట్ తో పాటు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో, కర్ణాటకలోని యాద్గిర్ పట్టణంలో కూడా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. మొత్తం 11 కేసుల్లో నేరాలు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు సయ్యద్ షకీల్ హోండా సిటీ కారుకు నకిలీ నంబర్ ప్లేట్లు పెట్టి దొంగతనాలకు వెళ్తాడని, అతను ఒక్కడే ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేస్తుండగా మిగిలిన ఇద్దరు బయట కాపలా ఉంటారని పోలీసులు వెల్లడించారు.
ఈ కేసు ఛేదనలో పాల్గొన్న నిజామాబాద్ డివిజన్ ఏసీపీ బి. ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలోని బృందం, నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్. శ్రీనివాస్, నవీపేట్ ఎస్ఐ కె. శ్రీకాంత్, సీసీఎస్ టీం ఏసీపీ పి. శ్రీశైలం, సీఐ అజయ్ కుమార్ తదితర సిబ్బందిని పోలీస్ కమీషనర్ అభినందించారు.





Post a Comment