•జిల్లా ఆసుపత్రిలో ‘బాల భరోసా’ -31 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు
•పెరుగుదల లోపాలను ప్రారంభంలోనే గుర్తించాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
•అంగన్వాడీల్లో స్క్రీనింగ్, జిల్లా ఆసుపత్రిలో చికిత్స: ‘బాల భరోసా’కు శ్రీకారం
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పోషణ అభియాన్, ఆరోగ్య శాఖ ఆర్‌బీఎస్‌కే సంయుక్తంగా ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారుల్లో పెరుగుదల లోపాలు, అంగవైకల్యాలు, మానసిక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు, రిఫరల్, సూచనలు అందించడం ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావచ్చని తెలిపారు.
జిల్లాలోని 13 ఆర్‌బీఎస్‌కే బృందాలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, అంగన్వాడీ టీచర్లు 42 ప్రశ్నల ఆధారంగా గుర్తించిన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ వివరించారు. అవసరమైన వారిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు.
కార్యక్రమం మొదటి రోజున జిల్లా ఆసుపత్రికి రిఫర్ అయిన 31 మంది చిన్నారులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స, మందులు అందజేశారు. చిన్నారుల పెరుగుదల లోపాలకు గల కారణాలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవీందర్, ఆర్డీఓ ఎన్‌వీ గిరి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రావ్, ఆర్‌బీఎస్‌కే రోహిత్, సీడీపీఓలు, సూపర్వైజర్లు, డీసీపీఓ, పోషణ అభియాన్ కోఆర్డినేటర్, అంగన్వాడీ టీచర్లు, ఆసుపత్రి సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Post a Comment