అమర్‌నాథ్ యాత్రకు సిద్దిపేట సరుకుల లారీ ప్రారంభం
దక్షిణ భారతంలో అమర్‌నాథ్ సేవాసమితికి ప్రత్యేక గుర్తింపు
భక్తితో చేసే సేవే పుణ్యకర్మ అన్న హరీష్ రావు
గో సంరక్షణపై 19న చాగంటి ప్రవచనాలు
15 ఏళ్లుగా కొనసాగుతున్న అన్నదాన సేవ
(తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో-దాస శ్రీనివాస్)/ సిద్దిపేట :
అమర్‌నాథ్ యాత్రికులకు అన్నదాన సేవ అందించేందుకు సిద్దిపేట అమరనాథ్ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో సరుకులతో కూడిన లారీని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం రాత్రి ప్రారంభించారు. సిద్దిపేట శరభేశ్వర దేవాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సిద్దిపేట అంటే తిరుపతి, శ్రీశైలం, అమర్‌నాథ్ ఎక్కడైనా ప్రత్యేక స్థానం ఉందని హరీష్ రావు అన్నారు. అమర్‌నాథ్ లో సిద్దిపేట లంగరుకు కూడా అదే ప్రత్యేకత ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. దక్షిణ భారతదేశంలో అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితికి ప్రత్యేక స్థానం ఉందని, 15 ఏళ్లుగా ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.
సిద్దిపేట ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవకు మారుపేరని, ఇందులో వైశ్యులు ముందుంటారని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో మనసుకు ప్రశాంతత వస్తుందని చెప్పారు. "నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది. యాత్రకు భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. మనం చేసే సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. మనం చేసే పనిలో భక్తి ప్రవేశిస్తే మనిషి మనస్సే ఆలయం అవుతుంది. ఆకలికి భక్తి తోడైతే అది ఉపవాసం అవుతుంది. మీరు పంపే ఆహారంలో భక్తి ప్రవేశించి ప్రసాదం అవుతుంది. మీరు చేసే పనిలో భక్తి ఉంది కాబట్టి మీరు చేస్తున్నది పుణ్య కర్మ అవుతుంది" అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
ఈ నెల 19న ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సిద్దిపేటకు గో సంరక్షణ యజ్ఞం తలపెట్టారని, గో సంరక్షణపై వారి ప్రవచనాలు సిద్దిపేట వైశ్య కన్వెన్షన్ హాల్ లో జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. గత 15 ఏళ్లుగా అందరి సహకారంతో సరుకుల లారీని అమర్‌నాథ్ కు పంపుతున్నామని గుర్తు చేశారు.





Post a Comment