Own Brother's Murder | రోడ్డు ప్రమాదం కాదు.. సొంత కొడుకునే చంపారు!

రోడ్డు ప్రమాదం కాదు.. సొంత కొడుకునే చంపారు!

హత్యను ప్రమాదంగా చిత్రీకరించిన తండ్రి, అన్న అరెస్టు  

వివరాలు వెల్లడించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ, జూన్ 14: కన్న కొడుకునే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన కేసులో తండ్రి, సోదరుడిని అరెస్టు చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి వెల్లడించారు. శనివారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు తెలిపారు.

తాగొచ్చి తల్లిదండ్రులపై దాడి 

బీర్కూర్‌కు చెందిన లక్ష్మణ్ (25) మద్యానికి బానిసయ్యాడు. డబ్బు కోసం తరచూ తల్లిదండ్రులను వేధిస్తూ కొట్టేవాడని డీఎస్పీ తెలిపారు. గత నెల 21న మద్యం మత్తులో ఇంటికొచ్చి డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులపై కర్రతో దాడికి పాల్పడ్డాడు.

అన్న, తండ్రి దాడితో మృతి

విషయం తెలుసుకున్న లక్ష్మణ్ సోదరుడు శ్రీకాంత్ ఇంటికి చేరుకుని కర్రతో లక్ష్మణ్ తలపై బలంగా కొట్టాడు. అదే సమయంలో తండ్రి గంగారం కూడా మరో కర్రతో తలపై మోదడంతో లక్ష్మణ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ప్రమాదం కథ అల్లి దహనం  

హత్య అనంతరం ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసి, కర్రలను దాచిపెట్టారు. రోడ్డు ప్రమాదంలో కొడుకు చనిపోయాడని బంధువులను, గ్రామస్తులను నమ్మించి అనుమానం రాకుండా వెంటనే అంత్యక్రియలు ముగించారు.

జీపిఓ చొరవతో బయటపడ్డ నిజం 

ఉదయాన్నే హడావుడిగా దహనం చేయడం చూసి అనుమానించిన జీవీఓ శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంతో దర్యాప్తు చేశారు. నిందితులు గంగారం, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు.

తల్లి పరారీ, నిందితులు రిమాండ్‌ 

ఇద్దరు నిందితులను నిజామాబాద్ జైలుకు తరలించారు. లక్ష్మణ్ తల్లి స్వరూప పరారీలో ఉంది. కేసును ఛేదించిన బాన్సువాడ గ్రామీణ సీఐ తిరుపయ్య, ఎస్సై రాములు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Post a Comment

Previous Post Next Post