స్క్రీన్ ప్లేని తలపించిన 'ఆపరేషన్ కవచ్'
'పోకిరి' స్టైల్లో దొంగను పట్టుకున్న కామారెడ్డి పోలీసులు
గంటల్లోనే చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్, సొత్తు స్వాధీనం
(తెలంగాణ డైలీ న్యూస్-కామారెడ్డి)
"మనం ఒకసారి కమిట్ అయితే మన మాట మనమే వినం" అన్న రేంజ్ లో సినిమా స్క్రీన్ ప్లేని తలపించేలా కామారెడ్డి జిల్లా పోలీసులు మెరుపు వేగంతో స్పందించారు. అర్ధరాత్రి దొంగతనం జరిగితే తెల్లవారేసరికి నిందితుడిని సినిమాటిక్ స్టైల్లో చేజ్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. 'ఆపరేషన్ కవచ్' మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ సమన్వయం ఎంత పక్కాగా పనిచేస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
ఘటన ఎలా జరిగింది ?
జూన్ 11 రాత్రి దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఇంటికి తాళం వేసి ఇంటి ముందు నిద్రపోయాడు. తెల్లవారుజామున ఇంట్లో వింత శబ్దం రావడంతో లోపలికి వెళ్లి చూడగా అపరిచిత వ్యక్తి సామాన్లు వెతుకుతున్నాడు. యజమానిని చూడగానే దొంగ పారిపోయాడు. ఇంట్లో చూడగా ఒక మొబైల్ ఫోన్, రూ.2,500 నగదు మాయమయ్యాయి.
డయల్-100 అలర్ట్.. కంట్రోల్ రూమ్ కమాండ్
బాధితుడు వెంటనే డయల్-100కు కాల్ చేసి దొంగ పారిపోయేటప్పుడు వేసుకున్న బట్టల వివరాలను చెప్పాడు. కామారెడ్డి జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ వెంటనే యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది. వైర్‌లెస్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, నైట్ పెట్రోలింగ్ బృందాలు, బ్లూ కోల్ట్స్ సిబ్బందికి అలర్ట్ పంపారు. గ్రౌండ్ లెవల్‌లో ఉన్న 'ఆపరేషన్ కవచ్' టీమ్స్ మొత్తాన్ని నిఘా వలయంగా మార్చారు.
ఆపరేషన్ కవచ్ చెక్‌పోస్ట్ వద్ద దొరికిన దొంగ
లింగాపూర్ నుంచి కామారెడ్డికి వెళ్లే దారిలో 'వసుంధర వెంచర్' సమీపంలో ఆపరేషన్ కవచ్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో తాడ్వాయి వైపు నుంచి వచ్చిన ఆటోలో ఉన్న వ్యక్తి వేసుకున్న బట్టలు కంట్రోల్ రూమ్ ఇచ్చిన డ్రెస్ డిస్క్రిప్షన్‌తో సరిపోయాయి. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నేపథ్యం
పోలీసుల విచారణలో నిందితుడు లింగాపూర్‌లో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి చోరీకి గురైన మొబైల్ ఫోన్, రూ.2,500 నగదును రికవరీ చేశారు. నిందితుడిని రాథోడ్ బొజ్జు, 45, తండ్రి లింబయ్య, నివాసం కన్నాపూర్ తాండా, రామారెడ్డి మండలం, వృత్తి కూలీగా గుర్తించారు. ఇతను పాత నేరస్థుడు. గతంలో దేవునిపల్లి, నిజామాబాద్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనం కేసులు ఉండి జైలు శిక్ష కూడా అనుభవించాడు.
కోర్టులో హాజరు.. రిమాండ్
దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
సిబ్బందికి ఎస్పీ రివార్డులు
ఈ ఆపరేషన్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. దొంగను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ ఏఆర్ శంకర్, కానిస్టేబుళ్లు మోసిన్, రంజిత్, గంగారంలతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వైర్‌లెస్ అలర్ట్ అందించిన కానిస్టేబుళ్లు సంతోష్ రెడ్డి, రమేష్, దేవరాజ్‌లకు ఎస్పీ కార్యాలయంలో నగదు బహుమతులు అందజేశారు.
ఎస్పీ ఏమన్నారంటే.....
ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, సిబ్బంది చూపిన అప్రమత్తత, వేగవంతమైన స్పందన, సమన్వయంతోనే నేరం జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం సాధ్యమైందన్నారు. ప్రజల భద్రతే పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యత అని, 'ఆపరేషన్ కవచ్' నేరాల నియంత్రణలో సమర్థవంతమైన ఫలితాలు ఇస్తోందని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.


Post a Comment