మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ
మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతిజ్ఞ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 25: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లాలో భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లా పరిపాలన, పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో అధికారులు, పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, సంక్షేమ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం జరిగిన సభలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, యువత దేశ భవిష్యత్తుకు మూలస్తంభమని, మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబాలు, సమాజం, దేశ అభివృద్ధిని కూడా దెబ్బతీస్తుందని తెలిపారు. విద్యార్థులు, యువత లక్ష్యాల సాధనపై దృష్టి సారించి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమాజ సహకారంతోనే కామారెడ్డిని మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దగలమని అన్నారు.
కార్యక్రమం ముగింపులో మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, వాటి నిర్మూలనకు కృషి చేయాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి, జిల్లా సంక్షేమ అధికారి ఐ. ప్రసన్న, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, పోలీసు అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.




Post a Comment