జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి: డీఎంహెచ్‌ఓ డా. జె. వెంకటి
పీహెచ్‌సీ వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందితో సమీక్ష
వర్షాకాల వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి, జూన్ 25: జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. జె. వెంకటి స్పష్టం చేశారు.
గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆరోగ్య విద్యాధికారులు, హెల్త్ సూపర్వైజర్లు, జిల్లా కార్యక్రమ అధికారులతో డీఎంహెచ్‌ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా NTEP, NLEP, NVBDCP, UIP, RMNCH+A, కుటుంబ నియంత్రణ, NP-NCD, NMHP, NTCP, అనీమియా ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మరియు వెల్‌నెస్ కేంద్రాల సేవలు, IDSP తదితర కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
డా. వెంకటి మాట్లాడుతూ, అన్ని ఆరోగ్య సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షయ, కుష్ఠు వ్యాధుల కేసులను ముందస్తుగా గుర్తించి పూర్తి స్థాయిలో చికిత్స అందించాలని, అధిక రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, అతిసార వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు, దోమల నివారణ చర్యలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు.
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంతో పాటు 100% పూర్తి స్థాయి టీకా కవరేజీ సాధించాలని తెలిపారు. కుటుంబ నియంత్రణ సేవలు, కిశోర బాలబాలికల ఆరోగ్య కార్యక్రమాలు, పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.
ఆరోగ్య, వెల్‌నెస్ కేంద్రాల ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, అవసరమైన మందులు, నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అన్ని ఆన్‌లైన్ పోర్టల్స్, రిజిస్టర్లు, నివేదికలను సకాలంలో నవీకరించాలని ఆదేశించారు.
ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతి ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, జిల్లాలో ఆరోగ్య సూచికలను మెరుగుపరచేందుకు సమన్వయంతో పనిచేసి, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలపాలని డీఎంహెచ్‌ఓ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యక్రమ అధికారులు డా. రోహిత్ కుమార్, డా. ప్రదీప్ కుమార్, డా. వెంకట్ స్వామి, మహేందర్ రెడ్డి, గాలమ్మా, వేణు గోపాల్, చలపతి, పద్మజ, జానాబాయ్, వైద్యాధికారులు, CHOs, HEOs, HSs మరియు ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.



Post a Comment