‘ఆపరేషన్ కవచ్’లో కామారెడ్డి పోలీసుల పంజా
జంతువుల అక్రమ వేట ముఠా గుట్టురట్టు – 8 మంది నిందితుల అరెస్ట్
5 నాటుతుపాకులు, 1 ఎయిర్ గన్, పేలుడు పదార్థాలు, 2 బైక్‌లు స్వాధీనం
బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ లో కొనుగోలు
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర
(తెలంగాణ డైలీ న్యూస్-కామారెడ్డి)
జిల్లాలో అక్రమ కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ కవచ్’లో గాంధారి పోలీసులు మరో కీలక కేసును ఛేదించారు. అడవి జంతువుల అక్రమ వేటకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, భారీగా నాటుతుపాకులు, పేలుడు పదార్థాలు, వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. (Video 👇)
వాహన తనిఖీల్లో పట్టుబడ్డ ముఠా
జూన్ 24 రాత్రి గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద గాంధారి ఎస్ఐ మహేందర్, సిబ్బంది ‘ఆపరేషన్ కవచ్’లో భాగంగా వాహన తనిఖీలు చేస్తుండగా, రెండు మోటార్ సైకిళ్లపై వచ్చిన ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి వెనుదిరిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. తనిఖీల్లో వారి వద్ద నాటుతుపాకులు, గన్‌పౌడర్, పొటాష్, స్టీల్ పెలెట్స్, ఫెల్ట్స్ వంటి వేట సామగ్రి లభించింది. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.
ప్రత్యేక బృందాలతో దర్యాప్తు
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో సదాశివనగర్ సీఐ, గాంధారి, తాడ్వాయి ఎస్ఐలు, సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.
విచారణలో నిందితులు అడవి జంతువుల వేటకు నాటుతుపాకులు కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. వర్షం కారణంగా వేటకు వెళ్లకుండా వెనుతిరుగుతూ పోలీసులకు చిక్కినట్లు తెలిపారు.
సరఫరాదారు సహా 8 మంది అరెస్ట్
మూడు నెలల క్రితం ఆంగోత్ ధర్మ నాయక్, సలావత్ చందర్ మధ్యవర్తిత్వంలో బాన్సువాడ మండలం చిన్నరాంపూర్‌కు చెందిన అస్లాం చావుస్ వద్ద ఒక్కో నాటుతుపాకిని రూ.10,000 చొప్పున కొనుగోలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. ట్రిగ్గర్ మెకానిజంలు లేని 3 తుపాకులను గండివేట్ తండా సమీపంలోని పొలంలో దాచినట్లు చెప్పడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం బాన్సువాడ మండలం చిన్నరాంపూర్ సమీపంలోని కోళ్ల ఫారంలో ఉన్న సలావత్ చందర్ (A-6), ఆంగోత్ ధర్మ నాయక్ (A-7), ప్రధాన సరఫరాదారు అస్లాం చావుస్ (A-8)లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 3 చాప్స్ (Barrels), 1 ఎయిర్ గన్, 3 ట్రిగ్గర్ మెకానిజంలు, స్టీల్ పెలెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన నిందితులు:
1. విస్లావత్ అరుణ్ (A-1)
2. విస్లావత్ గోపిచంద్ (A-2)
3. ఆంగోత్ లక్ష్మణ్ (A-3)
4. విస్లావత్ నాను (A-4)
5. విస్లావత్ గణేష్ (A-5) - A1 నుంచి A5 వరకు గండివేట్ తండా, గాంధారి మండలం
6. సలావత్ చందర్ (A-6) - హజీపూర్, నస్రుల్లాబాద్
7. ఆంగోత్ ధర్మ నాయక్ @ ధర్మ (A-7) - నాగధార్ రాంచందర్ తండా, నిజాంపేట్ మం., సంగారెడ్డి జిల్లా
8. అస్లాం చావుస్ (A-8) - చిన్నరాంపూర్, బాన్సువాడ మండలం
స్వాధీనం చేసుకున్న సామగ్రి:
- నాటుతుపాకులు: 5
- ఎయిర్ గన్: 1
- ట్రిగ్గర్ మెకానిజంలు: 3, చాప్స్ (Barrels): 3
- మందుగుండు & వేట సామగ్రి: స్టీల్ పెలెట్స్, గన్‌పౌడర్, పొటాష్, ఫెల్ట్స్
- వాహనాలు: 2 మోటార్ సైకిళ్లు
సిబ్బందికి రివార్డులు
కేసును సమర్థవంతంగా ఛేదించిన సదాశివనగర్ సీఐ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ మహేందర్, తాడ్వాయి ఎస్ఐ నరేష్, సిబ్బంది సంతోష్, పెంటయ్య, హోంగార్డ్ వీరప్రసాద్‌లను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించి నగదు బహుమతులు అందజేశారు.
‘నేరస్థులకు సింహస్వప్నం ఆపరేషన్ కవచ్’ : ఎస్పీ
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో అక్రమ ఆయుధాల సంస్కృతికి, వన్యప్రాణుల వేటకు తావులేదని హెచ్చరించారు. “నేరస్థులకు సింహస్వప్నం, ప్రజలకు రక్షణ భరోసా ఆపరేషన్ కవచ్. నిరంతర నిఘాతో చట్టవ్యతిరేక చర్యలపై ఉక్కుపాదం మోపుతాం. ప్రజల భద్రతే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు.




إرسال تعليق