ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందేందుకు ప్రజల సహకారం అవసరం
ఒక్క అర్హ ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకూడదు
తెలంగాణ డైలీ న్యూస్ / కామారెడ్డి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రజాస్వామ్య పరిరక్షణలో అత్యంత కీలకమైనదని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తన ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని, ఓటరు జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవడం లేదా ధృవీకరించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు.
ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని, ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని అన్నారు.
తమ పేర్లు ఓటరు జాబితాలో సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ వెంటనే పరిశీలించాలని, ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దించుకోవాలని, కొత్తగా అర్హత పొందిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలను సమర్పించి నమోదు, సవరణ, ధృవీకరణ ప్రక్రియను ఆలస్యం చేయకుండా పూర్తి చేసుకోవాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు, కార్యకర్తలందరి బాధ్యత అని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. గ్రామాలు, వార్డులు, కాలనీల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి, ఒక్క అర్హ ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఓటరు తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని, ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు.



Post a Comment