24 గంటల్లో నిందితుడి అరెస్ట్
12 లక్షల ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పుల కోసం దోపిడి
23 గ్రాముల బంగారు గొలుసు, బైక్, మొబైల్ స్వాధీనం
బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో జరిగిన బంగారు గొలుసు దోపిడి కేసును బాన్సువాడ పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబందించిన వివరాలను బాన్సువాడ డి ఎస్పీ విఠల్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఘటన వివరాలు
15.07.2026 రాత్రి 8.00 గంటల సమయంలో శాంతినగర్ కాలనీకి చెందిన బెజ్జం రమేష్ ఇంటి వద్ద ఉన్నాడు. నిందితుడు అతని ఇంటికి వెళ్లి తాను ఎక్సైజ్ శాఖ అధికారినని నమ్మించాడు. మీ కిరాణా దుకాణంలో మధ్యం సీసాలు విక్రయిస్తున్నారనే సమాచారం వచ్చిందని, తనిఖీ చేయాల్సి ఉందని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు. రమేష్ నీళ్లు తాగడానికి లోపలికి వెళ్లిన సమయంలో నిందితుడు వెనుక నుండి దాడి చేసి కింద పడవేశాడు. అతని మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు.
పిర్యాదు, దర్యాప్తు
బాధితుడి ఫిర్యాదు అందుకున్న వెంటనే బాన్సువాడ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సంఘటనా స్థలానికి చేరుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితుడి వివరాలు, అరెస్ట్
దర్యాప్తులో నిందితుడిని బత్తుల మునీశ్వర్, తండ్రి శివయ్య, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, దుర్కి గ్రామంగా గుర్తించారు. విచారణలో నిందితుడు చాలా కాలంగా క్రికెట్ బెట్టింగ్ లు, ఆన్ లైన్ గేమింగ్ లకు అలవాటు పడ్డాడని తెలిసింది. పోస్టాఫీస్ కు సంబంధించిన సుమారు 12 లక్షల ప్రభుత్వ నిధులను బెట్టింగ్ లలో కోల్పోయినట్లు ఒప్పుకున్నాడు.
శాఖాపరమైన విచారణలో కొంత మొత్తం తిరిగి చెల్లించినప్పటికీ ఇంకా 42,000/- రూపాయలు బకాయి ఉండటంతో అతనిని విధుల నుండి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా బెట్టింగ్ అలవాటును కొనసాగించడానికి డబ్బు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో అంగీకరించాడు.
నేడు నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి దోచుకున్న సుమారు 23 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ మరియు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు.
పోలీసు బృందాన్ని అభినందన
ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన ఇన్స్పెక్టర్, క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, కానిస్టేబుళ్లు పాండురంగ, సుదర్శన్ రావు, ప్రదీప్ రాజ్ లను ఉన్నతాధికారులు అభినందించారు.
బాన్సువాడ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులమని చెప్పి ఇళ్లలోకి లేదా వ్యాపార సంస్థల్లోకి వచ్చే వ్యక్తుల వివరాలను ధృవీకరించుకున్న తర్వాతే సహకరించాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు.



బాన్స్వాడ పోలీసులకు అభినందనలు. డా. కోత్వాల్ తుకారాం 🌹🙏
ReplyDeletePost a Comment