Fake Certificates | కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ పథకాలలో నకిలీ ధృవీకరణ పత్రాల వ్యవహారం ఛేదన

కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ పథకాలలో నకిలీ ధృవీకరణ పత్రాల వ్యవహారం ఛేదన  

ముగ్గురు నిందితుల అరెస్ట్ – నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, కంప్యూటర్ పరికరాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం  

ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పి యం రాజేష్ చంద్ర  వెల్లడి

కామారెడ్డి: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పేరుతో నకిలీ ధృవీకరణ పత్రాలు సృష్టించి ప్రభుత్వ సహాయం పొందేందుకు ప్రయత్నించిన ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఘటన నేపథ్యం:  

తేదీ 22.07.2026 నాడు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, కామారెడ్డి RMO డా. చందారి సంతోష్ ఫిర్యాదు చేశారు. తన పేరుతో, అధికారిక హోదాతో జారీ చేసినట్లుగా కనిపించే వయస్సు ధృవీకరణ పత్రాలు, మొదటి వివాహ ధృవీకరణ పత్రాలపై తనకు సంబంధం లేకుండా నకిలీ సంతకాలు, అధికారిక రబ్బరు ముద్ర దుర్వినియోగం జరిగిందని, వాటిని కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సహాయం పొందేందుకు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


దర్యాప్తు వివరాలు:  

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, యస్ఐ  సిబ్బందితో రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, డిజిటల్ రికార్డులు, సంబంధిత పత్రాలను సేకరించి విస్తృతంగా విచారించారు. భిక్కనూర్ గ్రామంలోని లహరి జిరాక్స్ అండ్ ఆన్‌లైన్ సెంటర్ వద్ద తనిఖీలు నిర్వహించగా ఈ నేరంలో ప్రమేయం ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం అంగీకరించారు.

నిందితుల మోసం విధానం:  

ప్రధాన నిందితులు తోడెంగల రాజా నరేందర్, తోడెంగల రాజలింగం భిక్కనూర్‌లో ఆన్‌లైన్ సేవా కేంద్రం నిర్వహిస్తూ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారి నుండి వివాహ పత్రికలు, ఆధార్, కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు సేకరించి ప్రతి దరఖాస్తుకు రూ.4,500 నుంచి రూ.5,000 వరకు సేవా రుసుము వసూలు చేసేవారు.

అనంతరం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి బోయిని ప్రసాద్‌తో కుమ్మక్కై, వైద్యాధికారుల అసలు సంతకాలు లేకుండా వారి పేర్లతో నకిలీ సంతకాలు, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు వేసి వయస్సు ధృవీకరణ పత్రాలు, మొదటి వివాహ ధృవీకరణ పత్రాలు తయారు చేసేవారు. వాటిని అసలైన పత్రాలుగా చూపి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అక్రమంగా పొందేవారు. ఇది నిందితుల కంప్యూటర్ పరిశీలనలో తేలింది.

నిందితుల వివరాలు:  

1. తోడెంగల రాజా నరేందర్, తండ్రి: రాజలింగం, నివాసం: భిక్కనూర్ గ్రామం & మండలం, కామారెడ్డి జిల్లా.  

2. తోడెంగల రాజలింగం, తండ్రి: రాజయ్య, నివాసం: భిక్కనూర్ గ్రామం & మండలం, కామారెడ్డి జిల్లా.  

3. బోయిని ప్రసాద్, తండ్రి: రామచంద్రం, నివాసం: భిక్కనూర్ గ్రామం & మండలం, కామారెడ్డి జిల్లా.

స్వాధీనం చేసిన వస్తువులు:  

నేరానికి ఉపయోగించిన కంప్యూటర్ CPU, LCD మానిటర్, కీబోర్డ్, మౌస్, మూడు మొబైల్ ఫోన్లు, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, స్టాంప్ ప్యాడ్, నకిలీ సంతకాలకు ఉపయోగించిన పెన్నులు, కంప్యూటర్‌లోని దరఖాస్తుల డిజిటల్ రికార్డులు మరియు ఇతర నేర సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అక్రమంగా సమర్పించిన దరఖాస్తుల సంఖ్య, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం, లబ్ధిదారుల వివరాలు, ఈ నేరంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

అభినందనలు:  

ఈ కేసును సాంకేతిక ఆధారాలతో చాకచక్యంగా ఛేదించిన కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి మరియు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐ.పి.ఎస్. అభినందించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

Post a Comment

أحدث أقدم