Father & Daughter Death | చెరువులో మునిగి తండ్రి కూతురు మృతి

భర్తకు దిష్టి తీసేందుకు వెళ్లిన కూతురు.. తోడుగా వెళ్లిన తండ్రి

అనారోగ్య భర్త కోలుకోవాలన్న ఆశతో కుంటకు.. విషాదంలో ముగిసిన ప్రయాణం

ఇద్దరు పిల్లలను ఒంటరిని చేసిన గోరిగోని కుంట ప్రమాదం

కామారెడ్డి, నవంబర్ 6: భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు.. ఎలాగైనా ఆయన కోలుకోవాలన్నదే ఆ కూతురి ఆశ. ఆ ఆశతోనే దిష్టి తీసి కుంటలో పడేసేందుకు బయలుదేరింది. కూతురికి తోడుగా తండ్రి కూడా వెళ్లాడు. కానీ ఆ ప్రయాణం ఇంటికి తిరిగి రాలేదు. తండ్రీకూతుళ్లిద్దరూ కుంటలోనే ప్రాణాలు వదిలారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం....

కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామానికి చెందిన సోమిశెట్టి రజిత (35) భర్త మల్లేశ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భర్తకు దిష్టి తగిలిందేమో, దిష్టి తీస్తే కోలుకుంటాడన్న నమ్మకంతో రజిత గురువారం సాయంత్రం కుంట వద్దకు వెళ్లింది. కూతురి బాధ చూసి తండ్రి, టేక్రియాల్ కు చెందిన సుంకరి పెద్ద నర్సింలు (65) ఆమెకు తోడుగా వెళ్లాడు.

పూజలు చేసి, దిష్టి వేసి స్నానానికి దిగిన సమయంలో ఇద్దరూ ప్రమాదవశాత్తు లోతైన నీటిలో పడిపోయారు. బయటపడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇద్దరూ నీటిలో మునిగి మృతి చెందారు. మృతదేహాలను గజ ఈతగాళ్లు సాయంత్రం బయటకు తీశారు.

కూతురి కష్టం చూసి ఆదుకోవడానికి వచ్చిన తండ్రి, భర్త కోసం పరితపించిన కూతురు.. ఇద్దరూ లేకపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. రజితకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. తల్లి, తాత ఇద్దరూ లేకపోవడంతో ఆ పిల్లల పరిస్థితి చూసి గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.

Post a Comment

أحدث أقدم