Top News

Harish Rao | కమిషన్ల పాలనే కొనసాగుతోంది : హరీష్ రావు

కాళేశ్వరం కూలిపోలేదు...

 గోదావరి జలాలు వస్తున్నాయి...

కమిషన్ల పాలనే కొనసాగుతోంది : హరీష్ రావు 

ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న హరీష్ రావు  

మహారాష్ట్ర కూలీలతో ముచ్చట్లు 

(దాస శ్రీనివాస్ - సిద్దిపేట బ్యూరో )

కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు.

గోదావరి జలాలు ప్రజల కళ్లకు కనిపిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కళ్లకు మాత్రం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పై రాజకీయంగా బురద చల్లడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

కాలేశ్వరం నుండి వచ్చే జలాలతోనే సిద్దిపేటలో పెద్ద ఎత్తున పంటలు పండాయని, ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములు నిండిపోయాయని తెలిపారు. ధాన్యం తరలించేందుకు లారీలు కూడా దొరకని పరిస్థితి ఉందన్నారు.

కమిషన్ల పాలనే కొనసాగుతోంది  

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొత్తం కమిషన్ల మీదే నడుస్తోందని హరీష్ రావు ఆరోపించారు. గురుకులాల్లో కోడిగుడ్ల నుండి విద్యార్థుల బూట్లు, యూనిఫామ్ వరకు ప్రతి దాంట్లో కమిషన్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రవాణా శాఖలో వాహనాల రేడియం స్టిక్కర్ల పైన కూడా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. గతంలో వెయ్యి రూపాయల్లోపే అయ్యే స్టిక్కర్ ఇప్పుడు 6 నుండి 7 వేల వరకు అవుతోందని, దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.





ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న హరీష్ రావు  

గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పటేల్ గార్డెన్‌లో సిద్దిపేట లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రజల ఆరోగ్యమే అసలైన అభివృద్ధి అన్నారు. లారీ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి తన సొంత ఖర్చుతో కళ్ల అద్దాలు, కంటి ఆపరేషన్లు చేయిస్తానని, వ్యక్తిగత ఇన్సూరెన్స్ కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. లారీల పార్కింగ్ కోసం స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానని అన్నారు.

మహారాష్ట్ర కూలీలతో ముచ్చట్లు  

అనంతరం చిన్నకోడూరు మండలం చందలపూర్ వెళ్తుండగా పెద్దకోడూరు పరిధిలోని పొలంలో నాట్లు వేస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాకు చెందిన మహిళా కూలీలను కలిశారు. కారు దిగి వారితో మాట్లాడి కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

సిద్దిపేట రైతులకు ముందు మొక్కలు ఇవ్వాలి  

 చందలపూర్ రంగనాయక సాగర్ వద్ద ఉన్న ఆయిల్ ఫామ్ నర్సరీని ఆయన సందర్శించారు. లారీలో ఇతర జిల్లాలకు తరలిస్తున్న మొక్కలను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయిల్ ఫెడ్ అధికారి భాస్కర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా రైతులకు సరిపడా మొక్కలు ఇవ్వకుండా ఇతర జిల్లాలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ముందు జిల్లా రైతుల అవసరాలు తీర్చాకే ఇతర జిల్లాలకు పంపాలని, వెంటనే వెళ్తున్న లారీలను ఆపాలని ఆదేశించారు.

నర్సరీ నిర్వహణ సరిగా లేదని, మొక్కల్లో ఇసుక ఉందని, సరిగా నీళ్లు పెట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీని వారానికి ఒకసారి తనిఖీ చేయాలని సూచించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని హరీష్ రావు స్పష్టం చేశారు.

Post a Comment

أحدث أقدم