Top News

EHS No Use | ప్రభుత్వ టీచర్‌కు అక్కరకు రాని EHS హెల్త్ కార్డ్

పుట్టిన పాపకు అరుదైన జన్యుపర చర్మ వ్యాధి - కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి బాధ

ప్రభుత్వ టీచర్‌కు అక్కరకు రాని EHS హెల్త్ కార్డ్ - ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యానికి నిరాకరణ

రోజుకు వేలల్లో ఖర్చు - ఎంత బిల్లు అవుతుందో తెలియని ఆందోళనలో తల్లిదండ్రులు

బాన్సువాడ/మొహమ్మద్ నగర్, సెప్టెంబర్ 11:

కంటిపాపలా చూడాల్సిన కూతురు పుట్టుకతోనే భయంకరమైన వ్యాధితో బాధపడుతుంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. కామారెడ్డి జిల్లా మహ్మద్ నగర్ మండలం మక్దూంపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహ్మద్ షఫీక్ కుటుంబంలో ఇదే పరిస్థితి నెలకొంది.

ఆగస్టు 21న షఫీక్ దంపతులకు పాప పుట్టింది. పుట్టుక నుంచే పాపకు అరుదైన జన్యుపర చర్మ సమస్య (Epidermolysis Bullosa తరహా వ్యాధిగా అనుమానం) ఉంది. చర్మంపై పెద్ద పెద్ద నీటి బొబ్బలు వచ్చి, చర్మం ఊడిపోయి శరీరమంతా పెద్ద పెద్ద గాయాలు అవుతున్నాయి. పసిపాప నొప్పితో విలవిలలాడుతోంది. ఫోటోల్లో కనిపిస్తున్న పాప చేతులు, శరీరంపై బొబ్బలు గుండెను కలచివేస్తున్నాయి.

వెంటనే పాపను ఆగస్టు 27న సికింద్రాబాద్ లోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి KIMS హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ NICU లో చేర్పించి చికిత్స మొదలుపెట్టారు. 15 రోజులుగా చికిత్స కొనసాగుతోంది.

EHS కార్డు ఉన్నా నో యూజ్:

ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో ప్రతి నెలా జీతం నుండి EHS (Employees Health Scheme) కోసం డబ్బులు కట్ అవుతున్నాయి. పాపను కూడా హెల్త్ కార్డులో నమోదు చేశారు. కానీ అవసరమైన సమయంలో ఆ కార్డు పనిచేయలేదని ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పిందని తండ్రి షఫీక్ వాపోతున్నారు.

అత్యవసరం కావడంతో తప్పనిసరిగా రూ.30,000 అడ్వాన్స్ చెల్లించి (బిల్లు ఫోటో జతచేశారు) అడ్మిట్ చేశారు. ఇప్పుడు రోజుకు వేల రూపాయల్లో బిల్లు పెరుగుతోందని, బాలింత అయిన తల్లి, పాప దగ్గరే ఉండటంతో తిండి, వసతి ఖర్చులు అదనపు భారంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

"నాలుగు నెలలుగా జీతం నుండి హెల్త్ కార్డుకు డబ్బు కట్ అవుతోంది. కానీ నా బిడ్డకు ఉచిత వైద్యం అందడం లేదు. ఎంత బిల్లు అవుతుందో, ఎలా కట్టాలో తెలియడం లేదు" అని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి EHS కింద నగదు రహిత వైద్యం అందేలా చూడాలని, అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ పాపను ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Post a Comment

أحدث أقدم