ప్రతి జిల్లాలో 70 గ్రామాలతో భూముల రీ సర్వే ప్రారంభం
DGPS, GIS టెక్నాలజీతో పారదర్శకత - రెవెన్యూ కార్యదర్శి ఆదేశం
ప్రతి భూమికి భూధార్ యూనిక్ నంబర్
తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వేను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి పారదర్శకతతో చేపట్టాలని, ప్రతి భూమికి స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
భూముల రీ సర్వే, నక్ష భూముల అంశాలపై గురువారం రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కామారెడ్డి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, ఏడి ల్యాండ్ సర్వే శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేను దశలవారీగా నిర్వహిస్తోందని కార్యదర్శి తెలిపారు. తొలి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు:
- రీ సర్వేకు DGPS, రోవర్స్, GIS వంటి ఆధునిక సాంకేతికతను తప్పనిసరిగా వినియోగించాలి.
- ప్రతి సర్వే నంబర్‌కు యాజమాన్యం స్పష్టంగా తెలిసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ యూనిక్ నంబర్ కేటాయించాలి.
- రీ సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలి.
- రెగ్యులర్ సర్వేయర్లతో పాటు లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను కూడా వినియోగించాలి.
- సోమవారం నుంచి సర్వేయర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు మరియు ఇతర సిబ్బందికి దశలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. శిక్షణ అనంతరం గ్రామాల్లో రీ సర్వే పనులు మొదలుపెట్టాలి.
- భూ భారతి పోర్టల్‌లో వచ్చే దరఖాస్తులను 60 రోజుల లోపు తప్పనిసరిగా పరిష్కరించాలి.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కీలక ఆదేశాలు
CCLA హైదరాబాద్ సూచనల ప్రకారం జిల్లాలో రీ సర్వే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు.
రీ సర్వే పురోగతిని ప్రతిరోజు స్ప్రెడ్ షీట్ రూపంలో సమర్పించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
లైసెన్స్ సర్వేయర్లతో వెంటనే సమావేశం నిర్వహించి వారి బాధ్యతలను వివరించాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
-------------
కలెక్టరేట్ ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
భద్రత, సీసీ కెమెరాల పనితీరు పరిశీలన
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను సందర్శించారు.
నెలవారీ తనిఖీలో భాగంగా ఆయన గోదాంలోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించి, ఎల్లప్పుడూ పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అదే సమయంలో గోదాం చుట్టుపక్కల భద్రత, రికార్డుల నిర్వహణ, ఈవీఎం సీలింగ్ విధానం తదితర అంశాలను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

إرسال تعليق