పొచారం నివాసానికి మంత్రి పొన్నం ప్రభాకర్ రాక
డీసీసీ అధ్యక్షుడితో పాటు నాయకుల ఘన స్వాగతం
SIR ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నాం: మంత్రి పొన్నం
ప్రజల హక్కులకు భంగం కలగదని స్పష్టీకరణ
ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుంది: మంత్రి వెల్లడి
ప్రజాప్రతినిధులతో అభివృద్ధి, రాజకీయ అంశాలపై చర్చ
బాన్సువాడ, తెలంగాణ డైలీ న్యూస్:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ సలహాదారు పొచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచ్చేశారు. కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పుష్పగుచ్ఛం అందజేసి మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, 2002లో ఓటర్ల సవరణ ప్రక్రియ జరిగిందని, అర్హుడైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు కోల్పోవద్దనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఓటరు సవరణ ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. ఇప్పుడు కూడా ఓటరు సవరణ ప్రక్రియ జరుగుతోందని అన్నారు. SIR అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వివరిస్తూ, ప్రజల్లో ఎలాంటి అపోహలకు తావులేకుండా SIR ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూ ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో బీహార్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్ల సవరణ ఫలితాలను తారుమారు చేసినట్లు కనిపిస్తోందని, అందుకే ప్రజలు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని, అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంస్థగా మారిపోయిందని అందరూ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు.
30 నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఉచితం చేయడమే కాకుండా బస్సుల యజమానులుగా మార్చామని తెలిపారు.
మాది ప్రతిపక్ష పార్టీ అయినందునే కేంద్ర ప్రభుత్వం ఎరువులు తక్కువ ఇస్తోందని, ఎక్కువ ఇవ్వాలని ఎంత మంది చెప్పినా కేంద్ర ప్రభుత్వం వినడం లేదని ఆరోపించారు. యూరియా యాప్‌ను కేంద్ర ప్రభుత్వమే తెచ్చిందని, యూరియా గురించి కేంద్ర ప్రభుత్వాన్నే అడగాలని, ఎరువుల శాఖ మంత్రి కూడా కేంద్ర మంత్రేనని అన్నారు.
రైతు భరోసా ప్రారంభమైందని, 9 రోజుల్లోపు అర్హులందరికీ అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో మంత్రి సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షెట్కర్, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, నాయకులు మహ్మద్ ఏజాస్, పిట్ల శ్రీధర్, రఫిక్, హకీం, మహ్మద్ గౌస్, ఇలియాజ్, అబ్దుల్ వాహబ్,పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









إرسال تعليق