"కేసీఆర్‌ను మోసం చేయలేదు"
పెండింగ్ బిల్లులతో పనులు స్తంభన
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను నిర్ణయం తీసుకున్నానని, మంత్రి పదవి గానీ డబ్బు గానీ ఆశించి కాదని ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో మంగళవారం జరిగిన వనభోజనాల కార్యక్రమంలో కార్యకర్తలతో ఆత్మీయంగా మాట్లాడిన ఆయన పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
"జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నా"
"నేను కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు. కేవలం జాతీయ జెండా మాత్రమే కప్పుకున్నాను. నియోజకవర్గంలో ఆగిపోయిన పనులు పూర్తి చేయించడానికే ఈ నిర్ణయం తీసుకున్నా" అని పోచారం అన్నారు.
నిధుల కోసం మంత్రి పొంగులేటితో మాట్లాడిన తర్వాత, ఆయనతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి 6 నెలల్లో అన్ని బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. కానీ ఏడాది గడిచినా సగం నిధులు మాత్రమే వచ్చాయని, మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
"సీఎం రేవంత్ రెడ్డి గానీ, మంత్రులు గానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసినా స్పందన లేదు. అయినా సీఎం, డిప్యూటీ సీఎంను కలిసి బాన్సువాడ సమస్యలు వివరించాను" అని తెలిపారు.
పెండింగ్ బిల్లులతో పనులు స్తంభన
బాన్సువాడలో 6 నెలలుగా డెవలప్‌మెంట్ బిల్లులు, ప్రాజెక్టు నిధులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. నిధులు రాకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారని, దీంతో నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతోందని పేర్కొన్నారు.
"కేసీఆర్‌ను మోసం చేయలేదు"
మాజీ సీఎం కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, కానీ కొందరి వ్యవహార శైలి కారణంగా బీఆర్ఎస్‌ను వదలాల్సి వచ్చిందని పోచారం అన్నారు. ప్రజల కోసం, నియోజకవర్గ ప్రగతి కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే అది కేసీఆర్ హయాంలోనే జరిగిందని కూడా ఆయన గుర్తుచేశారు. పోచారం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.


Really 😅. Anyways ktr don't believe 😅
ReplyDeletePost a Comment