Top News

Neet Free Training | నీట్, జేఈఈలకు లాంగ్‌టర్మ్ ఉచిత శిక్షణ

నీట్, జేఈఈలకు లాంగ్‌టర్మ్ ఉచిత శిక్షణ

ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

బీసీ విద్యార్థులకు సువర్ణ అవకాశం 

కామారెడ్డి, ఆగస్టు 12: ఇంటర్‌ పూర్తి చేసిన వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులు జాతీయ స్థాయి వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రముఖ వైద్య, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో సీట్లు సాధించేలా మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణ అందించనున్నట్లు బీసీ గురుకులాల ఉమ్మడి కామారెడ్డి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త సి. రాధికా తెలిపారు.

నీట్-యూజీ, జేఈఈ-2027 ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత లాంగ్‌టర్మ్ రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నారు. ఇంటర్‌లో ఉత్తీర్ణులైన, నీట్, జేఈఈ-2026లో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులు శిక్షణకు అర్హులు.

ఎంపిక విధానం

విద్యార్థులకు మెరిట్, సీట్ల లభ్యత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.

రెండు కేంద్రాల్లో శిక్షణ

ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 16వ తేదీ వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బాలికలకు నీట్‌లో 100, జేఈఈలో 40 సీట్లు, బాలురకు నీట్‌లో 50, జేఈఈలో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి.బాలికలకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కళాశాల, నాగోల్‌లో, బాలురకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కళాశాల, అబ్దుల్లాపూర్‌మెట్‌లో లాంగ్‌టర్మ్ శిక్షణ అందించనున్నారు.

ఉచిత వసతి, స్టడీ మెటీరియల్

విద్యార్థులు ఆన్‌లైన్‌లో https://mjptbcadmissions.org వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిపుణులైన అధ్యాపకులతో బోధన, ఉచిత వసతి, స్టడీ మెటీరియల్‌ అందించడంతో పాటు ప్రత్యేక ప్రణాళికతో తరగతులు నిర్వహిస్తారు. విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచేందుకు మాక్‌ టెస్టులు, గ్రాండ్‌ టెస్టులు నిర్వహించనున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బీసీ గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణను బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సి రాధికా. సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని నీట్, జేఈఈలో ఉత్తమ ఫలితాలు సాధించి వైద్య, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలని ఆకాంక్షించారు.

Post a Comment

أحدث أقدم