ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి - కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, సెప్టెంబర్ 16: రానున్న ఖరీఫ్ 2026-27 సీజన్ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్ల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు:
*-* జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 3,19,361 ఎకరాల్లో 7,10,661 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా. అందులో 4,59,295 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాలని లక్ష్యం.
*-* నోటిఫై చేసిన 7 సన్న రకాల రాకలు అక్టోబర్ రెండో వారంలో బాన్సువాడ, ఎల్లారెడ్డి, పిట్లం డివిజన్లలో, నవంబర్ మొదటి వారంలో కామారెడ్డి డివిజన్‌లో ప్రారంభమయ్యే అవకాశం.
*-* జిల్లా వ్యాప్తంగా IKP, PACSల ఆధ్వర్యంలో 414 కొనుగోలు కేంద్రాలు (PPCలు) ఏర్పాటు ప్రతిపాదన. వరద ముప్పు ఉన్న 34 కేంద్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం.
*-* సెప్టెంబర్ 22న సొసైటీ సెక్రటరీలు, APMలు, PPC ఇన్‌చార్జీలకు శిక్షణ. కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఫొటోలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే అప్‌లోడ్ చేయాలని, నకిలీ ఫొటోలు అనుమతించబోమని స్పష్టీకరణ.
*-* ధాన్యం క్లీనర్లు, తేమ మీటర్లు, వెయింగ్ స్కేల్స్, హస్క్ రిమూవర్లు సిద్ధం. అదనంగా టార్పాలిన్లు, ఆటోమేటిక్ క్లీనర్లు సమకూర్చాలని ఆదేశం.
*-* నిల్వ కోసం ప్రస్తుతం 70,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం AMC గోడౌన్లు, రైస్ మిల్లుల్లో గుర్తింపు. కర్ణాటకలోని బీదర్ పరిసరాల్లో నిల్వ సౌకర్యాలను పరిశీలించాలని సూచన.
*-* పాత గన్నీ బ్యాగులను రైస్ మిల్లర్లు వెంటనే తిరిగి అప్పగించాలి. రవాణా వాహనాలకు సెప్టెంబర్ 25 లోపు GPS ఏర్పాటు చేయాలి.
*-* గత రబీ సీజన్‌లో ఎదురైన జాప్యం పునరావృతం కాకుండా, కొనుగోలు కేంద్రాల్లో ముందుగానే తగిన సంఖ్యలో హమాలీలను అందుబాటులో ఉంచాలని ఆదేశం.
రైతుల నుంచి ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, శిక్షణ కలెక్టర్ రవితేజ, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ దామోదర్ రెడ్డి, డీఎం శ్రీకాంత్, డీసీఓ రామ్మోహన్, వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి, అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
=============
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి - కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, సెప్టెంబర్ 16:
జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళికతో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక కమిటీ సమావేశం జరిగింది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, వివిధ మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, టైడ్ మరియు అన్‌టైడ్ గ్రాంట్ల వినియోగంపై సమావేశంలో చర్చించారు.
టైడ్ గ్రాంట్ల ద్వారా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా పనులు, అన్‌టైడ్ గ్రాంట్ల ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా శాశ్వత నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించారు.
జిల్లా పరిషత్, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా, అంగన్‌వాడీ, పశుసంవర్ధక, ఇంజనీరింగ్, పంచాయతీ శాఖలకు నిధుల కేటాయింపుపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేటాయించిన నిధులను నిర్దేశిత ప్రయోజనాల కోసం సమర్థవంతంగా వినియోగించి, ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తూ నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
సమావేశంలో జడ్పీ సీఈఓ ఓ. చందర్, అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, డీపీఓ మురళి, డీఈఓ మల్లికార్జున్, వైద్యాధికారి వెంకట్, డీడబ్ల్యూఓ ప్రసన్న, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.


إرسال تعليق