బాన్సువాడలో జర్నలిస్టులకు 2 రోజుల శిక్షణ - మీడియా అకాడమీ ఆధ్వర్యంలో 29, 30 తేదీల్లో నిర్వహణ
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను కలిసి ఆహ్వానించిన మీడియా అకాడమీ కార్యదర్శి
రెండు రోజుల శిక్షణలో 8 కీలక అంశాలపై నిపుణులతో శిక్షణ
కామారెడ్డి, సెప్టెంబర్ 24: బాన్సువాడలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 29, 30 తేదీల్లో జర్నలిస్టులకు రెండు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి నాగుల్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, చైర్మన్ ఓఎస్డీ రహ్మాన్, మేనేజర్ శైలేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శిక్షణా కార్యక్రమ ఏర్పాట్లు, చర్చించనున్న అంశాలను కలెక్టర్ కు వివరించి, కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఇంచార్జి DPRO / అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి పాల్గొన్నారు.
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలను కూడా ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
రెండు రోజుల శిక్షణలో 8 కీలక అంశాలపై నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమాచార హక్కు చట్టం, తప్పొప్పుల పరిశీలన (Fact Checking), నేర వార్తల కవరేజ్, వార్తా కథనాల రూపకల్పన, వార్తా సేకరణ, వార్తల ప్రాధాన్యత నిర్ణయం, మీడియా చట్టాలు - నైతిక నియమాలు, వృత్తిపరమైన ప్రమాణాలు తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు.
జర్నలిజం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టుల నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యమని, ఈ శిక్షణ రోజువారీ విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుందని అకాడమీ కార్యదర్శి పేర్కొన్నారు.
ముగింపు కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ ను ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో TUWJ IJU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రజనీకాంత్, రాజేష్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మొయినుద్దీన్, చంద్రశేఖర్, అభిద్ హుస్సేన్ పాల్గొన్నారు.




إرسال تعليق