Top News

MLC To Amer Ali Khan | ఆమెర్ అలీ ఖాన్ తొలగింపుపై ముస్లిం సమాజంలో అసంతృప్తి

 

ఆమెర్ అలీ ఖాన్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి - కాంగ్రెస్ కు 'సియాసత్' మద్దతు మరువద్దు

నవంబర్ లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఆమెర్ అలీ ఖాన్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్

ఆమెర్ అలీ ఖాన్ తొలగింపుపై ముస్లిం సమాజంలో అసంతృప్తి - కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి

జనగాం: ప్రముఖ ఉర్దూ దినపత్రిక 'సియాసత్' న్యూస్ ఎడిటర్ ఆమెర్ అలీ ఖాన్ కు తిరిగి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ జావీద్ అలీ డిమాండ్ చేశారు. నవంబర్ లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఆయనకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

జనగాంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో 'సియాసత్' పత్రిక, ఆమెర్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు పదేళ్లుగా బీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న ముస్లిం సమాజంలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మండలాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముస్లిం సమస్యలపై చర్చకు తెరతీశారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెర్ అలీ ఖాన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం ముస్లింలలో సానుకూల భావన కలిగించిందని, అయితే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన స్థానంలో అజహరుద్దీన్ పేరును ప్రభుత్వం గవర్నర్ కు పంపడంపై ముస్లిం సమాజంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన న్యాయపరమైన వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్నారు.

ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తొలగించడం సరైన నిర్ణయం కాదని, దీనిపై ఉలమాలు, న్యాయవాదులు, మేధావులు, ముస్లిం నాయకులు, తెలంగాణతో పాటు విదేశాల్లోని పలువురు స్పందిస్తున్నారని తెలిపారు.

2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'సియాసత్' యాజమాన్యంతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు మద్దతుగా నిలిచిన వారితో ఇలా వ్యవహరించడం తగదన్నారు. ఆమెర్ అలీ ఖాన్ కు న్యాయం చేయకపోతే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్ల వైఖరిపై ప్రభావం పడుతుందని, ఇది స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికలతో పాటు 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ కు నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ నాయకత్వం ఈ అంశాన్ని పరిశీలించి, నవంబర్ లో ఖాళీ అయ్యే స్థానాల్లో ఒకటి ఆమెర్ అలీ ఖాన్ కు కేటాయించి తిరిగి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment

أحدث أقدم