ఉద్యోగం అంటే జీతం కాదు.. 30 ఏళ్ల అనుబంధం..!
రిటైర్మెంట్ రోజు బస్సును హత్తుకుని ఏడ్చిన డ్రైవర్..!!
కేరళ, సెప్టెంబర్ 04:
ఉద్యోగం అంటే కేవలం జీతం కోసమే కాదు.. కొంతమందికి అది ఒక జీవితం. అలాంటి అనుబంధానికి నిదర్శనం ఈ ఘటన.
కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ KSRTC లో ఇడుక్కి జిల్లా కుమిలి డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న పాల్ కురియన్ అనే వ్యక్తి గత 30 ఏళ్లుగా నిర్విరామంగా సేవలందించారు. ఎండనకా వాననకా వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.
సెప్టెంబర్ 2న ఆయన సర్వీసులో చివరి రోజు. చివరి డ్యూటీ ముగించుకుని డిపోకు వచ్చిన తర్వాత ఆయన చేసిన పని అందరి హృదయాలను కదిలించింది.
ముందుగా బస్సు లోపల డ్రైవర్ సీట్లో కూర్చుని స్టీరింగ్ ను ప్రేమగా ముద్దాడారు. ఆ తర్వాత కిందకు దిగి, 30 ఏళ్లు తనకు అన్నం పెట్టిన బస్సు ముందు భాగాన్ని రెండు చేతులతో గట్టిగా హత్తుకుని చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరిగా బస్సుకు సెల్యూట్ చేసి భారమైన హృదయంతో అక్కడి నుండి వెళ్లిపోయారు.
అక్కడే ఉన్న తోటి ఉద్యోగి ఈ దృశ్యాన్ని ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో వైరల్ అయింది.
వీడియో చూసిన నెటిజన్లు "ఇది ఉద్యోగం పట్ల అంకితభావం, నిజమైన ప్రేమ" అంటూ కామెంట్లు పెడుతున్నారు. "30 ఏళ్లు ఒకే సంస్థలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంటి కంటే ఎక్కువ సమయం బస్సులోనే గడిపి ఉంటారు. అందుకే అంత అనుబంధం" అని మరొకరు రాశారు.
ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగాల్లో రెండేళ్లకే కంపెనీలు మారే రోజుల్లో, 30 ఏళ్ల పాటు ఒకే యూనిఫామ్ తో, ఒకే బాధ్యతతో పనిచేసిన పాల్ కురియన్ జీవితం చాలా మందికి స్ఫూర్తిగా మారింది. ఈ వీడియోకు ఇప్పటికే లక్షల్లో వ్యూస్, వేలల్లో షేర్లు వచ్చాయి.




إرسال تعليق