బాన్సువాడలో భారీ చోరీ కేసు ఛేదింపు - ఇద్దరు అరెస్ట్, రూ.56 లక్షల సొత్తు స్వాధీనం
పక్కింటి వ్యక్తే దొంగ - పథకం ప్రకారం చోరీ
సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలు గుర్తింపు - ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడి
కామారెడ్డి / బాన్సువాడ, అక్టోబర్ 2: బాన్సువాడ పట్టణంలో సంచలనం సృష్టించిన భారీ ఇంటి దొంగతనం కేసును బాన్సువాడ పట్టణ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ లో సొత్తును విక్రయించేందుకు వెళ్తుండగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 56 లక్షల విలువైన 31.2 తులాల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.
కేసు వివరాలు:
సెప్టెంబర్ 27న బాన్సువాడ పట్టణంలోని గౌలిగూడ కాలనీకి చెందిన చింతల భాస్కర్ తన భార్యతో కలిసి మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటికి తాళం వేసి తన కిరాణా దుకాణానికి వెళ్లారు. సాయంత్రం 6.30 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంటి పై అంతస్తులోని బెడ్ రూమ్ లాకర్ లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదు, ఇన్వర్టర్ ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బాన్సువాడ టౌన్ ఎస్హెచ్ఓ టి. శ్రీధర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్ఐ శిరీష, సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరా ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో అక్టోబర్ 2న వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బొగ్గు గుడిసె చౌరస్తా సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా గౌలిగూడ కాలనీ చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన సొత్తును హైదరాబాద్ లో విక్రయించేందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
పక్కింటి వ్యక్తే దొంగ - పథకం ప్రకారం చోరీ:
నిందితులైన దండుగుల మైసయ్య, దండుగుల ఎల్లయ్య ఇద్దరూ బంధువులు. నిందితుడు మైసయ్య బాధితుడి ఇంటి పక్కనే నివాసం ఉండటంతో బాధితుల రాకపోకలను కొంతకాలంగా గమనిస్తున్నాడు. ఇద్దరూ కలిసి వైన్స్ కు వెళ్లి మద్యం తాగిన అనంతరం, మైసయ్య జూన్, జూలై నెలల్లో 6 దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లిన సమయంలో బెయిల్ కోసం అతని భార్య చేసిన అప్పులను తీర్చేందుకు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు.
బాధితుడి ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన నిందితులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దొంగిలించి మోటార్ సైకిల్ పై పరారయ్యారు.
అరెస్ట్ అయిన నిందితులు:
A1. దండుగుల మైసయ్య @ మణికంఠ, తండ్రి మైసయ్య, వయసు 25 సం., బాన్సువాడ. ఇతనిపై గతంలో 6 ఇంటి దొంగతనం కేసులు ఉన్నాయి. బాన్సువాడ పీఎస్ పరిధిలో 4, గాంధారి పీఎస్ పరిధిలో 2 కేసులు.
A2. దండుగుల ఎల్లయ్య @ రాజు, తండ్రి భీమయ్య, వయసు 20 సం., బాన్సువాడ.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
1. 31.2 తులాల బంగారు ఆభరణాలు
2. 3 కిలోల వెండి ఆభరణాలు
3. రూ. 9,700 నగదు
4. నేరంలో ఉపయోగించిన Hero HF Deluxe మోటార్ సైకిల్, 2 మొబైల్ ఫోన్లు
నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కోసం బిచ్కుంద కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి, టౌన్ ఎస్హెచ్ఓ టి. శ్రీధర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్ఐ శిరీష, క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, కానిస్టేబుళ్లు పృథ్వీకుమార్, పాండురంగ, సుదర్శన్ రావు, రజిత మరియు సీసీఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మైసయ్య, కానిస్టేబుళ్లు జె. రవి, శ్రీనివాస్, స్వామిలను జిల్లా ఎస్పీ అభినందించారు.




إرسال تعليق