Gandhi Jayanthi | నేను చూసిన బాపు కుటీర్...!

నేను చూసిన బాపు కుటీర్...!

ఒక చిన్న గ్రామం.. ఒక మహా చరిత్ర

ఆది నివాస్ నుంచి బాపు కుటీర్ వరకు

ఆరు సంవత్సరాల జ్ఞాపకాల్లో గాంధీజీ

గాంధీ జయంతి సందర్బంగా ప్రత్యేక కథనం 

✍️చింతకింది సాయిగౌడ్, సీనియర్ జర్నలిస్ట్, బాన్సువాడ (8500891919)

కొన్ని ప్రదేశాలను మనం చూస్తాం, మరచిపోతాం. కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం మనల్ని జీవితాంతం ఆలోచింపజేస్తాయి. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని సేవాగ్రామ్ నాకు అలాంటి ప్రదేశమే.

2012 నుంచి 2018 వరకు దాదాపు ఆరు సంవత్సరాల పాటు వార్ధా సమీపంలోని పుల్గావ్ లో నివసించే అవకాశం నాకు వచ్చింది. ఆ సమయంలో సేవాగ్రామ్ ఆశ్రమానికి ఎన్నోసార్లు వెళ్లాను. ప్రతిసారీ అక్కడి వాతావరణం, ఆ నిశ్శబ్దం, గాంధీజీ నివసించిన ఆ చిన్న చిన్న కుటీరాలు నాలో ఒక కొత్త ఆలోచనను మిగిల్చేవి.

ముఖ్యంగా బాపు కుటీర్ ముందు నిలబడిన ప్రతిసారీ ఒక ప్రశ్న నా మనసులో మెదిలేది - భారత స్వాతంత్రం కోసం ప్రజలందరినీ కదిలించిన మహాత్ముడు నివసించిన ఇల్లు ఇంత చిన్నదా? అవును, అదే బాపు కుటీర్. గాంధీజీ జీవితంలో గొప్పదనం ఆయన నివసించిన భవనంలో లేదు, ఆ చిన్న కుటీరం నుంచి ఆయన ప్రపంచానికి చెప్పిన ఆలోచనల్లో ఉంది.

ఒక చిన్న గ్రామం.. ఒక మహా చరిత్ర

1936 ఏప్రిల్ 30న గాంధీజీ వార్ధా సమీపంలోని సేగావ్ గ్రామానికి చేరుకున్నారు. నాగపూర్ కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గ్రామం. స్వాతంత్ర ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారతదేశానికి మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని గాంధీజీ ఎన్నుకున్నారు.

అప్పటికి అక్కడ రహదారి లేదు, పోస్టాఫీసు లేదు, టెలిగ్రాఫ్ సౌకర్యం కూడా లేదు. గ్రామం చుట్టూ అడవి ఉండేది. పాములు, తేళ్లు సాధారణంగా కనిపించేవని సేవాగ్రామ్ చరిత్ర చెబుతోంది. గాంధీజీకి మాత్రం అదే కావాలి. నగరానికి దూరంగా, అధికారానికి దూరంగా, ఆడంబరాలకు దూరంగా, భారత గ్రామీణ జీవితానికి దగ్గరగా ఉండాలని ఆయన భావించారు. అదే ఆయన సేవాగ్రామ్ ప్రయోగం.

ఆ గ్రామం మొదట పేరు సేగావ్. తరువాత 1940లో సేవాగ్రామ్ గా మారింది. సేవాగ్రామ్ అంటే సేవ చేసే గ్రామం.

గాంధీజీ కోసం నిర్మించబోయే మొదటి కుటీర్ కు ఆయన ఒక ముఖ్యమైన షరతు పెట్టారు - ఖర్చు 500 రూపాయలకు మించకూడదు. అంతేకాదు, స్థానికంగా దొరికే పదార్థాలనే ఉపయోగించాలి. దీనినే ఆయన ఆది నివాస్ అని కూడా పిలిచేవారు. దేశం మొత్తం ఆయన మాట వినే కాలంలో, ఆయనకు కావలసింది రాజభవనం కాదు, ఒక చిన్న కుటీర్. అందులో కొద్దిపాటి వస్తువులు, కొద్దిపాటి అవసరాలు. కానీ ఆ చిన్న ఇంటి నుంచి వెలువడిన ఆలోచనలు మాత్రం ఒక దేశ భవిష్యత్తును ప్రభావితం చేశాయి.

ఆది నివాస్ నుంచి బాపు కుటీర్ వరకు

సేవాగ్రామ్ కు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, గాంధీజీని కలవడానికి వచ్చే వారు పెరుగుతూ ఉండటంతో ఆది నివాస్ చిన్నదైపోయింది. గాంధీజీ శిష్యురాలు మీరాబెన్ నిర్మించుకున్న కుటీర్ నే తరువాత గాంధీజీ తన నివాసంగా ఉపయోగించడం ప్రారంభించారు. అదే నేడు మనకు బాపు కుటీర్ గా పరిచయం.

అక్కడికి వెళ్లినప్పుడు మన కళ్ల ముందు కనిపించేది ఒక చిన్న గది, చిన్న మంచం, గాంధీజీ ఉపయోగించిన వస్తువులు, ఆయన కూర్చునే ప్రదేశం, ఆయన ఉత్తరాలు రాసిన జీవన వాతావరణం. కానీ వాటిని చూస్తున్నప్పుడు మన ఊహలో మాత్రం ఒక మహా భారతం కనిపిస్తుంది.

ఫొటోలు కాదు, జ్ఞాపకాలు

2012 నుంచి 2018 మధ్య ఎన్నోసార్లు నేను బాపు కుటీర్ ను సందర్శించాను. ప్రతిసారీ ఫొటో తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఫొటోలను తిరిగి చూస్తుంటే అవి కేవలం ఫొటోలు కావు, అవి నా జీవితంలోని ఒక కాలానికి సంబంధించిన జ్ఞాపకాలు.

ఆ సమయంలో నేను పుల్గావ్ లో ఉన్నాను. వార్ధా నేలతో నాకు ఒక అనుబంధం ఏర్పడింది. సేవాగ్రామ్ కు వెళ్లడం ఒక సాధారణ సందర్శనలా అనిపించలేదు. గాంధీజీ అడుగుజాడల్లో కొంత దూరం నడిచిన అనుభూతి కలిగేది. ఆశ్రమంలోని నిశ్శబ్దం మనల్ని మనతోనే మాట్లాడుకునేలా చేస్తుంది.

చిన్న కుటీర్... చెప్పే పెద్ద సందేశం

బాపు కుటీర్ ను చూస్తే నాకు అనిపించేది ఒక్కటే - మనిషి గొప్పతనం అతను నివసించే ఇంటి పరిమాణంలో ఉండదు, అతని ఆలోచనల పరిమాణంలో ఉంటుంది.

గాంధీజీ నివసించిన కుటీర్ చిన్నది. కానీ అక్కడి నుంచి వచ్చిన ఆలోచనలు ప్రపంచమంతా ప్రయాణించాయి. సత్యం, అహింస, స్వావలంబన, గ్రామస్వరాజ్యం, సరళమైన జీవితం, అవసరాలను తగ్గించుకోవడం, ప్రజలకు సేవ చేయడం, ఇవన్నీ ఆ చిన్న కుటీర్ చుట్టూ జీవించిన ఆలోచనలు.

సేవాగ్రామ్ ఆశ్రమం స్వయంగా గాంధీజీ జీవన తత్వానికి ఒక ప్రతిరూపంగా నిలిచిందని ఆశ్రమ చరిత్ర చెబుతోంది.

మన అవసరాలు ఎంత వరకు ఉండాలి?

గాంధీ జయంతి సందర్భంగా నా పాత ఫొటోలను తిరిగి చూస్తుంటే ఒక విషయం గుర్తొస్తోంది. చరిత్ర పుస్తకాల్లో మాత్రమే ఉండదు. కొన్ని సందర్భాల్లో మనం నడిచిన దారిలో ఉంటుంది. మన చేతితో తాకిన గోడలో ఉంటుంది. మన కళ్లతో చూసిన ఒక చిన్న కుటీర్ లో ఉంటుంది. మన కెమెరాలో బంధించిన ఒక ఫొటోలో ఉంటుంది.

2012 నుంచి 2018 వరకు పుల్గావ్ లో ఉన్న ఆ ఆరు సంవత్సరాలు ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయాయి. కానీ సేవాగ్రామ్ లో నేను చూసిన బాపు కుటీర్ మాత్రం నా జ్ఞాపకాలలో ఇప్పటికీ అలాగే ఉంది. చిన్నదైన ఆ కుటీర్ భారత చరిత్రలో మాత్రం ఎంతో పెద్దది.

గాంధీజీ వెళ్లిపోయారు, కాలం మారిపోయింది, సేవాగ్రామ్ కూడా మారింది. కానీ ఆ చిన్న బాపు కుటీర్ మనకు ఇంకా ఒక ప్రశ్న వేస్తూనే ఉంది - మన అవసరాలు ఎంత వరకు ఉండాలి? మన జీవితం ఎవరి కోసం ఉండాలి? ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడమే బహుశా గాంధీని గుర్తు చేసుకోవడం.



Post a Comment

أحدث أقدم