చికెన్ వ్యర్థాల టెండర్‌లో అవకతవకలు.. తిరిగి నిర్వహించాలని డిమాండ్
మున్సిపల్ ఆదాయానికి నష్టం.. అధికారుల తీరుపై అనుమానాలు
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానన్న బాధితుడు రాకేష్
కామారెడ్డి, అక్టోబర్ 29: కామారెడ్డి మున్సిపాలిటీలో చికెన్ వ్యర్థాల సేకరణకు నిర్వహించిన టెండర్ ప్రక్రియ సరిగా లేదని, వెంటనే తిరిగి నిర్వహించాలని బాధితుడు రాకేష్ డిమాండ్ చేశారు.
గురువారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చికెన్ వ్యర్థాల సేకరణ నిమిత్తం దరఖాస్తులను టెండర్ బాక్స్ లో వేసి సీల్ చేసి, కోట్ చేసిన వారందరి సమక్షంలో తీయాల్సి ఉండగా అధికారులు నిబంధన విరుద్ధంగా తీశారని ఆరోపించారు. కవర్లను అధికారులు తీసుకొని వెళ్లి తీయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ఇతర జిల్లాల్లో మున్సిపాలిటీలలో చికెన్ వ్యర్థాల టెండర్ సుమారు రూ. 8 నుంచి 12 లక్షల వరకు వెళ్తుంటే, కామారెడ్డిలో మాత్రం కేవలం రూ. 2 లక్షల 30 వేలకే వెళ్లడం విచిత్రంగా ఉందన్నారు. దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ ప్రకటనలో కూడా కొద్దిపాటి సమయాన్ని మాత్రమే ఇచ్చారని, అందరికీ సమాచారం తెలిసేలా ప్రకటన ఇవ్వాలన్నారు.
గత సంవత్సరం చికెన్ వ్యర్థాల సేకరణకు రూ. 3 లక్షలకు పైగా టెండర్ వెళ్లగా, ప్రస్తుతం లక్ష రూపాయలు తక్కువకు వెళ్లడం చర్చనీయాంశంగా మారిందన్నారు. టెండర్ నిర్వహణలో సరైన విధానం పాటించలేదని, తిరిగి నిర్వహించాలని కోరారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ తో పాటు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.
ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ తో పాటు డీఈలను పత్రిక విలేకరులు వివరణ కోరగా, సమావేశానికి వెళ్తున్నామని చెప్పి దాటవేశారు.

إرسال تعليق