విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్టీసీ అధికారులు
మాణిక్ భండార్ వద్ద బస్సులు ఆపకపోవడంపై TGVP టౌన్ ప్రెసిడెంట్ అఖిల్ ఆగ్రహం
అదనపు బస్సులు నడపకపోతే బస్టాండ్ ముట్టడిస్తామని హెచ్చరిక
నిజామాబాద్, అక్టోబర్ 28: నిజామాబాద్ నుండి ఆర్మూర్ - మాక్లూర్ రూట్లలో ప్రయాణించే కాలేజీ విద్యార్థుల బస్సు ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ అఖిల్ ఆర్టీసీ అధికారులను హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుండి ఆర్మూర్ రూట్ లో వెళ్లే VREC, KITS, KCEA వంటి ప్రముఖ కళాశాలలకు వందలాది మంది విద్యార్థులు నిత్యం ప్రయాణిస్తున్నారని, అయితే మాణిక్ భండార్ స్టేజ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపకపోవడం వల్ల విద్యార్థులు గంటల తరబడి బస్టాండ్ లో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. బస్సులను అక్కడ తప్పనిసరిగా ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా బోర్గాం(కె), మాణిక్ భండార్, అమ్రాద్, ఒడ్డెడ్ పల్లి ప్రాంతాల నుండి మాక్లూర్ ప్రభుత్వ ఇంటర్ కళాశాలకు వెళ్లే విద్యార్థులకు సరిపడా బస్సులు లేవని పేర్కొన్నారు. బస్సుల కొరత కారణంగా ప్రత్యామ్నాయం లేక 18 ఏళ్లు కూడా నిండని మైనర్ విద్యార్థులు లైసెన్స్ లేకుండానే బైక్ లపై కళాశాలలకు వెళ్తున్నారని, దీనివల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు, ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని మాణిక్ భండార్ వద్ద బస్సులు ఆపాలని, విద్యార్థుల రద్దీకి అనుగుణంగా తక్షణమే అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ డిపో మేనేజర్, రీజినల్ మేనేజర్లను డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే విద్యార్థులను ఏకం చేసి నిజామాబాద్ బస్టాండ్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ నాయకులు సుజిత్, హేమంత్, నైతిక్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق