Theft Case | మద్నూర్‌లో వరుస చోరీల కేసు ఛేదన - ఇద్దరు అరెస్ట్

మద్నూర్‌లో వరుస చోరీల కేసు ఛేదన - ఇద్దరు అరెస్ట్

10 తులాల బంగారం, 50 తులాల వెండి స్వాధీనం - ఎస్పీ రాజేష్ చంద్ర అభినందన

కామారెడ్డి, అక్టోబర్ 7: మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రాత్రి జరిగిన వరుస ఇళ్ల చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.

సెప్టెంబర్ 4 రాత్రి మద్నూర్ గ్రామంలో ఒక ఇల్లు, మేనూర్ గ్రామంలో మూడు ఇళ్లలో చోరీలు జరిగాయి. కేసులు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాలతో, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు చేపట్టారు.

సాంకేతిక ఆధారాలతో నిందితులను మహారాష్ట్ర బస్మత్ ప్రాంతానికి చెందిన గుండెవర్ కరణ్, శైలేష్ బాలు పవర్ @ బాబా, రాహుల్ ఎల్లప్పగా గుర్తించారు. మంగళవారం మరోసారి చోరీకి మద్నూర్ వస్తున్న గుండెవర్ కరణ్, శివ ఎల్లప్పలను మిర్జాపూర్ హనుమాన్ ఆలయం వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,100 నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో చోరీ సొమ్మును మహారాష్ట్రకు చెందిన మంగేష్, నౌషాద్, రైస్ లకు అమ్మినట్లు తేలింది. వారి వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 50 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

కేసు ఛేదనలో కృషి చేసిన మద్నూర్ ఎస్సై మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు విఠల్, విష్ణు, సీసీఎస్ సిబ్బంది గణపతి, రాజేందర్, శ్రీనివాస్, లక్ష్మీకాంత్, రవిలను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.



Post a Comment

أحدث أقدم