తెలంగాణ యువకులకు రష్యాలో నరకం బాన్సువాడ యువకుడి మృతి కలకలం
NDTV బ్రేకింగ్ తర్వాత బాన్సువాడలో బాధితుడి కుటుంబీకుల్లో ఆందోళన
రష్యా అడవి నుంచి సిర్షు అశోక్ వాయిస్ మెసేజ్
అధికారికంగా ధ్రువీకరణ లేదు
బాన్సువాడ / నిజామాబాద్:
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నలుగురు యువకులను ఏజెంట్ మోసం చేసి రష్యా సైన్యంలో చేర్పించిన దారుణం గత 10 రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నలుగురిలో ఒకరైన బాన్సువాడకు చెందిన మహమ్మద్ అఫ్జల్ ఖాన్ (43) మృతి చెందాడనే వార్త NDTV WORLD లో ప్రచురితం కావడంతో జాతీయ స్థాయిలో సంచలనం రేపుతోంది.
రష్యా అడవుల నుంచి తోటి బాధితుడు సిర్షు అశోక్ తన భార్యకు పంపిన వాయిస్ మెసేజ్ లో "ఆఫ్జల్ ఖాన్ చనిపోయి వారం రోజులు అవుతోంది, యుద్ధంలో చనిపోయాడు, నేను కూడా బిక్కుబిక్కుమంటూ అడవుల్లో తిరుగుతున్నాను" అని చెప్పడం అందరి హృదయాలను కలచివేస్తోంది.
ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు బాధితుల్లో ఇద్దరు మొదటి విడతగా 50 మంది సైన్య బృందంతో వెళ్లగా, మరో ఇద్దరు మరో బృందంతో వెళ్లారు.
బాధిత కుటుంబం ఆందోళన
ఆఫ్జల్ ఖాన్ మృతి చెందిన విషయాన్ని ధృవీకరించేందుకు అతని తండ్రి అబ్బాస్ ఖాన్, భార్య, అన్నదమ్ములు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
జిల్లా ఎస్పీ కార్యాలయానికి, ఎంపీ ధర్మపురి అరవింద్, MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, MBT స్పోక్స్ పర్సన్ అంజదుల్లా ఖాన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నా ఎలాంటి సమాచారం లభించడం లేదని కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కేవలం అశోక్ ఇచ్చిన సమాచారం ఒక్కటే వారి వద్ద ఉంది. ఇండియన్ ఎంబసి ద్వారా, లేదా రష్యా ప్రభుత్వం ద్వారా అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.
"నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడా? లేడా?" అంటూ తండ్రి అబ్బాస్ ఖాన్ రోదిస్తున్న తీరు బాన్సువాడలో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కొడుకు బతికి ఉంటే వెంటనే రప్పియాలని, దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే కనీసం అధికారికంగా ధ్రువీకరించాలని ఆయన కోరుతున్నారు. ఏం జరుగుతోందని కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఆఫ్జల్ ఖాన్ కు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. (బాధితుల వీడియో 👇ఫైల్ )
ఏం జరిగింది?
- ఆయిల్ ఇండస్ట్రీలో గార్డెనింగ్, లోడింగ్, గ్రాస్ కటింగ్ ఉద్యోగాలంటూ నమ్మించి రష్యాకు తీసుకెళ్లారు.
- అక్కడ 5 నెలలు పని చేయించి 2 నెలలకే జీతం ఇచ్చి నిరుద్యోగులుగా మార్చారు.
- ఆ తర్వాత పౌరసత్వం, డబ్బు ఆశ చూపి బలవంతంగా రష్యా ఆర్మీలో చేర్పించారు.
- బాంబులు మోయడం, ఫ్రంట్ లైన్ డ్యూటీలు, రోజూ 10-15 కి.మీ నడక, గన్స్ పేల్చడం, మారణాయుధాల శిక్షణ.
- సరైన ఆహారం లేక అడవుల్లో బిక్కుబిక్కుమంటున్నామని ఫోన్లలో వాపోతున్నారు.
బాధితులు ఎవరు?
- మహమ్మద్ అఫ్జల్ ఖాన్ (43) - బాన్సువాడ
- భూక్యా రవీందర్-నిజామాబాద్ రూరల్
- సిర్షు అశోక్ - నిజామాబాద్ రూరల్
- మేగావత్ ప్రకాష్ - నిజామాబాద్ రూరల్
ప్రభుత్వానికి విజ్ఞప్తి:
బాధిత కుటుంబాలు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని, ఎంపీ అరవింద్ ను ఆశ్రయించారు. సీఎం రేవంత్ రెడ్డికి, విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖలు రాశారు. మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ద్వారా నిర్ధారణకు ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేదు.
విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 227 మంది భారతీయులు రష్యా ఆర్మీలో చేరగా, 139 మందిని విడుదల చేయగా, 51 మంది చనిపోయారు.
అఫ్జల్ ఖాన్ మృతి నిజమైతే మృతదేహాన్ని, మిగిలిన ముగ్గురిని సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని కుటుంబాలు వేడుకుంటున్నాయి.
![]() |
| File Photos |





إرسال تعليق