Enquiry on KMR Muncipality |మున్సిపాలిటీ ఆరోపణలపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం

కామారెడ్డి మున్సిపాలిటీ ఆరోపణలపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశం

నిర్దిష్ట గడువులో నివేదిక ఇవ్వాలి - అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరికి బాధ్యత - కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఆరోపణలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు - ఫిర్యాదులకు ప్రజావాణిలో అవకాశం - గోప్యతకు హామీ

కామారెడ్డి, నవంబర్ 3: కామారెడ్డి మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, మున్సిపల్ పాలనలో అవకతవకలు జరుగుతున్నాయని పత్రికల్లో వచ్చిన కథనాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరిని ఆదేశించారు.

విచారణ అంశాలు:

- మున్సిపల్ ఇంజనీరింగ్ టెండర్ల ప్రక్రియ, పారిశుద్ధ్య సిబ్బంది నియామకాలు, హాజరు, వేతనాల చెల్లింపులు

- సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల జోక్యంపై ఆరోపణలు

- పట్టణ ప్రణాళిక విభాగం నోటీసులు, తదుపరి చర్యలు, మున్సిపల్ కౌన్సిల్ నెలవారీ సమావేశాలు

- గణేష్ నిమజ్జనానికి కొన్న ఇనుప సామగ్రి వినియోగం, అనంతర విక్రయం

- మున్సిపల్ వాహనాల ఇంధన వినియోగం, వ్యాపార అనుమతులు, ఇంటి పన్ను మదింపు తదితర అంశాలు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ సేవల్లో అవకతవకలు, అక్రమ వసూళ్లు ఉపేక్షించబోమని, ఆరోపణలు రుజువైతే ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మున్సిపల్ సేవల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా, బెదిరింపులకు గురిచేసినా ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఫిర్యాదులు అదనపు కలెక్టర్ కార్యాలయంలో లేదా కలెక్టరేట్ ప్రజావాణిలో ఇవ్వవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Post a Comment

أحدث أقدم