జనావాసాల మధ్య బాంబుల గుట్ట!
బాన్సువాడ పేలుడు ఘటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భయాందోళన
పందుల వేట పేరుతో నాటు బాంబులు, గుట్టల్లో జెలెటిన్ దందా, దీపావళి టపాసుల అక్రమ నిల్వలు
నిబంధనలు గాలికి -కానరాని రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖల సంయుక్త తనిఖీలు, నిఘా ఎక్కడ?
తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో/కామారెడ్డి :
బాన్సువాడ ఎర్రమన్నుకుచ్చ లో జరిగిన నాటు బాంబుల పేలుడు ఘటన జిల్లాలో జరుగుతున్న ఒక పెద్ద అక్రమ దందాకు అద్దం పట్టింది. పందుల వేట కోసం అని చెబుతున్నా, అసలు జనావాసాల మధ్య ఇంత భారీగా పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.
మూడు కోణాల్లో ముప్పు...
నాటు బాంబుల తయారీ - పందుల వేట ముసుగు:
కామారెడ్డి, బాన్సువాడ, యెల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో అడవి పందుల బెడద ఎక్కువ. పంటలను కాపాడుకునేందుకు రైతులు గుండు సూదులు, జెలెటిన్, సల్ఫర్ కలిపి తయారుచేసే నాటు బాంబులను పొలాల్లో పెడుతున్నారు. ఒక్కో బాంబు రూ.200 నుంచి రూ.500కి విక్రయిస్తున్నారు. వీటి తయారీకి ఎలాంటి లైసెన్స్ లేదు, నైపుణ్యం లేదు. ఇళ్లలోనే తయారుచేసి మోపెడ్‌లపై తరలిస్తున్నారు. ఆదివారం పేలింది ఇదే రకం బాంబులే.
జెలెటిన్ స్టిక్స్ అక్రమ నిల్వ - క్రషర్ల దందా:
జిల్లాలో 40కి పైగా స్టోన్ క్రషర్లు, క్వారీలు ఉన్నాయి. వీటికి పేలుడు పదార్థాల వాడకానికి మైనింగ్, పోలీస్, పేలుడు పదార్థాల నియంత్రణ సంస్థ (PESO) అనుమతి తప్పనిసరి. కానీ అధికశాతం చోట్ల అనుమతికి మించి వందల కొద్దీ జెలెటిన్ స్టిక్స్, డెటోనేటర్లు నిల్వ ఉంచుతున్నారు. తనిఖీలు లేకపోవడంతో కొందరు క్రషర్ యజమానులు ఈ జెలెటిన్‌ను బయటకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే నాటు బాంబుల తయారీకి ముడిసరుకుగా మారుతోంది.
దీపావళి టపాసుల పేరుతో ప్రమాదకర నిల్వ:
దీపావళి సమీపిస్తుండటంతో జిల్లాలో అనుమతి లేని చోట్ల కూడా భారీగా టపాసులు నిల్వ చేశారు. నిబంధనల ప్రకారం జనావాసాలకు దూరంగా, అగ్నిమాపక అనుమతితోనే నిల్వ చేయాలి. కానీ బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి పట్టణాల్లో ఇరుకైన దుకాణాలు, ఇళ్లలోనే కుప్పలుగా టపాసులు నిల్వ ఉంచారు. చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే ప్రమాదం ఉంది.
అధికారులు ఏం చేస్తున్నారు?
సంవత్సరంలో ఒక్కసారి కూడా రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖలు సంయుక్త తనిఖీలు చేయడం లేదనే విమర్శ ఉంది. నిన్నటి ఘటన తర్వాత కూడా కేవలం కేసు నమోదుకే పరిమితమయ్యారు. జిల్లా వ్యాప్తంగా అన్ని క్రషర్లు, టపాసుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి, అక్రమ నిల్వలను సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రేపు జరిగేది ఇంకో ఎర్రమన్ను కుచ్చ పేలుడు ఘటనే అవుతుంది.






إرسال تعليق