Safety First | జాగ్రత్తలు పాటిస్తేనే పండుగ సంతోషం: ఫైర్ ఆఫీసర్ సలాం

బాన్సువాడలో టపాకాయల దుకాణాలకు కఠిన నిబంధనలు

32 దరఖాస్తులు పరిశీలనలో, తనిఖీ తర్వాతే అనుమతి

జాగ్రత్తలు పాటిస్తేనే పండుగ సంతోషం: ఫైర్ ఆఫీసర్ సలాం

బాన్సువాడ, నవంబర్ 5: బాన్సువాడ ఫైర్ స్టేషన్ పరిధిలో పిట్లం, బాన్సువాడ, బీర్కూర్, నసరులాబాద్ మండలాల పరిధిలో టపాకాయల దుకాణాల అనుమతుల కోసం మొత్తం 32 దరఖాస్తులు వచ్చాయని ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ సలాం తెలిపారు. నిబంధనలు పాటిస్తేనే వారికి అనుమతులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.టపాకాయల దుకాణాలకు కావాల్సిన అనుమతులు ఏమిటి అని "తెలంగాణ డైలీ న్యూస్ "  ప్రతినిధి  అడగగా ఆయన ఇలా వివరించారు.

ప్రశ్న: దుకాణం పెట్టాలంటే ఏ అనుమతులు కావాలి?

జవాబు: ముందుగా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఫైర్ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తప్పనిసరి. దుకాణం బహిరంగ ప్రదేశంలో, జనసంచారం తక్కువగా ఉండే చోట ఉండాలి. దుకాణం చుట్టూ మండే పదార్థాలు ఉండకూడదు. అగ్నిమాపక పరికరాలు, ఇసుక బకెట్లు, నీటి సదుపాయం తప్పనిసరిగా ఉండాలి. దుకాణంలో లైసెన్స్ కాపీని కనిపించేలా పెట్టాలి. అనుమతి లేకుండా ఎవరూ దుకాణం నిర్వహించకూడదు.

ప్రశ్న: దుకాణ నిర్వహణలో ఎలాంటి నిబంధనలు పాటించాలి?

జవాబు: దుకాణంలో బాణసంచాను సురక్షితంగా నిల్వ చేయాలి. దుకాణం దగ్గర పొగ తాగడం, అగ్గిపెట్టె, లైటర్ వాడడం నిషేధం. ఒకేసారి ఎక్కువ మొత్తంలో బాణసంచా నిల్వ చేయకూడదు. దుకాణం లోపల విద్యుత్ వైర్లు వేలాడుతూ ఉండకూడదు. చిన్న పిల్లలకు బాణసంచా అమ్మకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేస్తాము. తనిఖీల సమయంలో లోపాలు కనిపిస్తే చర్యలు తీసుకుంటాము.

ప్రశ్న: 32 దరఖాస్తుల పరిస్థితి ఏమిటి?

జవాబు: పిట్లం, బాన్సవాడ, నసరులాబాద్, బిర్కూర్ నాలుగు మండలాల నుంచి వచ్చిన 32 దరఖాస్తులను పరిశీలిస్తున్నాము. ప్రతి దుకాణాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇస్తాము. నిబంధనలు పాటించని వారికి అనుమతి ఇవ్వము.

ప్రశ్న: బాణసంచా కొనేటప్పుడు ప్రజలు ఏమి చూడాలి?

జవాబు: అధికృత లేదా లైసెన్స్ కలిగిన అమ్మకందారు నుంచి మాత్రమే బాణసంచాను కొనుగోలు చేయవలెను. అనుమతి లేని చోట కొనవద్దు.

ప్రశ్న: బాణసంచా ఎక్కడ కాల్చాలి?

జవాబు: బాణసంచాను బహిరంగ మరియు ఖాళీ ప్రదేశంలో కాల్చవలెను. జనాలకు, వాహనాలకు దూరంగా ఉంచవలెను. బాణసంచాను ఎల్లప్పుడూ పిల్లలకు దూరంగా భద్రపరచవలెను. పెద్దలు పిల్లలపై ఒక కన్నేసి ఉంచాలి.

ప్రశ్న: బాణసంచా కాల్చేటప్పుడు దుస్తులు ఎలా ఉండాలి?

జవాబు: బాణసంచాను కాల్చేటప్పుడు కచ్చితంగా కాటన్ దుస్తులు ధరించవలెను. సింథటిక్ దుస్తులు, వదులుగా ఉండే దుస్తులు ధరించకూడదు.

ప్రశ్న: బాణసంచా ఎలా వెలిగించాలి?

జవాబు: అగరుబత్తితోనే బాణసంచాను వెలిగించవలెను. అగ్గిపెట్టెలు మరియు లైటర్లను ఉపయోగించకూడదు. ఒక్కసారి ఒక బాణసంచా మాత్రమే వెలిగించవలెను. ఇతరులు సురక్షితమైన దూరం నుండి చూడవలెను. చేతిలో ఉంచుకుని బాణసంచాను వెలిగించకూడదు. వేరొక వ్యక్తి మీదకి వెలిగించిన బాణసంచాను విసరకూడదు.

ప్రశ్న: అగ్ని ప్రమాదం జరిగితే ఏమి చేయాలి?

జవాబు: బాణసంచా అగ్ని ప్రమాద సందర్భంలో బకెట్ లో నీరు పోయడం ద్వారా జ్వాల చల్లారును. ప్రతి పెద్ద అగ్ని చిన్నదిగానే మొదలవుతుంది. బట్టలకు అగ్ని అంటుకున్నట్లయితే ఆపడం, పడుకోవడం, దొర్లించడం ద్వారా అగ్నిని ఆర్పివేయండి. కాలిన గాయాలు అయినట్లయితే ఆ ప్రాంతంలో ఎక్కువ నీటిని పోయాలి. కాలిన ప్రాంతంలో క్రీమ్, లేపనం, నూనె పూయకూడదు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి.

ప్రశ్న: చేయకూడనివి ఏమిటి?

జవాబు: మీ సొంతంగా బాణసంచా తయారు చేయడానికి ప్రయత్నించకూడదు. ఇంట్లో బాణసంచా తయారు చేయుటకు ప్రయత్నం చేయకూడదు. మూసి ఉంచిన పెట్టెలలో బాణసంచాను వెలిగించకూడదు. వెలిగి ఆరిపోయిన బాణసంచా దగ్గరకు వెంటనే వెళ్ళకూడదు. దానిని తెరుచుటకు ప్రయత్నించవద్దు. పిల్లలను బాణసంచా వెలిగించుటకు ఒంటరిగా వదలకూడదు. జేబులలో బాణసంచాను తీసుకురాకూడదు. ఇరుకు సందులలో బాణసంచాను వెలిగించకూడదు. బాణసంచాతో ప్రయోగాలు చేయరాదు.

ప్రశ్న: అత్యవసర సమయంలో ఎవరికి ఫోన్ చేయాలి?

జవాబు: ఒకవేళ పొగలు లేదా అగ్ని ప్రమాదం సంభవించిన సందర్భంలో దయచేసి 101 లేదా 8712699275 లేదా సమీప ఫైర్ స్టేషన్ కు కాల్ చేసి ప్రమాద వివరాలను మరియు చిరునామాను తెలియపరచండి.

ప్రశ్న: చివరగా ప్రజలకు మీ సందేశం?

జవాబు: బాణసంచా ఆనందం కోసం, ప్రమాదం కోసం కాదు. జాగ్రత్తలు పాటిస్తేనే పండుగ సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.




Post a Comment

أحدث أقدم