రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏటీఎం యంత్రం చోరీ
మెషిన్ లో ఉన్న ₹8 లక్షలు గాయబ్
తెలంగాణ డైలీ న్యూస్, రాజన్న సిరిసిల్ల:
ఇప్పటి వరకు ఏటీఎమ్ మిషన్లను ధ్వంసం చేసి డబ్బులు దొంగిలించిన సంఘటనలు జరిగాయి... కానీ ఏకంగా ఏటిఎమ్ మెషిన్ ను ఎత్తు కెళ్ళిన ఘటనలు జరగలేదు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధాన రహదారిపై ఉన్న ఏటీఎంను దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న ఏటీఎంనే లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడడం సంచలనంగా మారింది.
జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంను దుండగులు ఎత్తుకెళ్లారు. బొలెరో వాహనంలో వచ్చిన అగంతకులు దర్జాగా ఎత్తుకెళ్లిపోయారు.
ఎల్లారెడ్డిపేట మెయిన్ రోడ్డుపై ఏటీఎంను ఎత్తుకెళ్లారన్న సమాచారం అందుకున్న వెంటనే రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే, డీఎస్పీ నాగేంద్ర చారీలు హుటాహుటినా స్థలానికి చేరుకున్నారు. చోరీకి గురైన ఏటీఎం వద్దకు చేరుకున్న ఎస్పీ ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. సీసీ కెమెరాల ఆధారంగా బొలెరో వాహనం ఎటువైపుగా వెళ్లి ఉంటుందోనని ఆరా తీస్తున్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ విభాగాలు ఎల్లారెడ్డిపేటకు చేరుకుని ఆధారాల కోసం అన్వేషిస్తున్నాయి.
ఏటిఎమ్ లో రూ. 8 లక్షలు
శుక్రవారం సాయంత్రమే బ్యాంకు అధికారులు ఏటీఎంలో రూ. 8 లక్షల నగదును అందుబాటులో ఉంచినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఏటీఎంలో నగదు ఉందన్న విషయాన్ని గమనించే అగంతకులు మిషన్ ను ఎత్తుకెళ్లి ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ప్రధాన రహదరిపైనే ఉన్న ఏటీఎంను ఎత్తుకెళ్లే ముందు దుండగులు రెక్కీ నిర్వహించి ఉంటారని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘటనకు ముందు ఏటీఎం పరిసర ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు సంచరించారా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.
సెక్యూరిటీ లేదా..?
SBI ఏటీఎం వద్ద సెక్యూరిటీ చర్యలు తీసుకోలేదని స్పష్టం అవుతోంది. కేవలం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన బ్యాంకులు సెక్యూరిటీ గార్డులను నియమించే విషయంలో పట్టించుకోని వైఖరి అవలంబిస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి ఏకంగా ఏటీఎం మిషన్ ను ఎత్తు కెళ్లారు. బ్యాంకులు సెక్యూరిటీ గార్డులను నియమించే విషయంలో పట్టించుకోని వైఖరి అవలంబిస్తున్నట్టుగా ఉంది. శుక్రవారం అర్ధరాత్రి ఏకంగా ఏటీఎం మిషన్ ను ఎత్తుకెళ్లిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు.
నగదు ఉంచే మిషన్ల వద్ద సెక్యూరిటీ గార్డును నియమించినట్లయితే అంగతకులు చోరీ చేసేందుకు సాహసించే అవకాశం ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏకంగా బ్యాంకుల్లోకి చొరబడి దోపిడీలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా ఏటీఎంల వద్ద భద్రతా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.



Post a Comment