Accreditation Cards | అందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి

 

వెబ్, టివి, కేబుల్ ఛానల్స్ లో పని చేసే జర్నలిస్ట్ లకు కార్డులు ఇవ్వాలి 

డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ డిమాండ్

తెలంగాణ డైలీ న్యూస్ బ్యూరో, హైదరాబాద్:

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో శుక్రవారం మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐ అండ్ పి ఆర్ కమిషనర్ ప్రియాంక, ఎస్ ఏ ఎం సి సమావేశంలో పాల్గొన్న అక్రెడిటేషన్ కమిటీ సభ్యులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జ్యోతిబసు, ఎస్కే మస్తాన్ మాట్లాడుతూ.. అక్రెడిటేషన్ విషయంలో డెస్క్ జర్నలిస్టులతో పాటు చాలా మంది రిపోర్టర్లకు, వెబ్ జర్నలిస్టులకు, టీవీ, కేబుల్ ఛానల్స్ లో పనిచేసే జర్నలిస్టులకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు. 

             ప్రభుత్వం జారీ చేసిన జీవోలో డెస్క్ జర్నలిస్టులకు ఎడిషన్ కు నాలుగు మాత్రమే అక్రెడిటేషన్లు ఇస్తామని నిబంధన ఉందన్నారు. ఈ నిబంధన వల్ల చాలా మంది డెస్క్ జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెబ్, టీవీ, కేబుల్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ కార్డులు సరిపోను రావడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అర్హులైన డెస్క్ జర్నలిస్టులకు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు వస్తాయని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.  దీంతో ఆయా పత్రికల యాజమాన్యాలు అర్హులైన డెస్క్ జర్నలిస్టుల జాబితాను ఇప్పటికే ఐ అండ్ పి ఆర్, డిపిఆర్ఓలకు అందజేసినట్లు చెప్పారు.  ఆ జాబితాను పరిగణలోకి తీసుకొని అక్రెడిటేషన్ కార్డులు తగ్గించకుండా, సర్క్యులేషన్ తో సంబంధం లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ  కార్యక్రమంలో TUWJ అధ్యక్షులు విరహత్ అలీ, డి జె ఎఫ్ టి నాయకులు, అక్రెడిటేషన్ కమిటీ మెంబర్ బి.శ్రీనివాసరావు, సంఘం నాయకులు లలిత, నిస్సార్, విజయ, వినోద్ రావు, బిక్షం, రామకృష్ణ, భాస్కర్, మనోజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post